Warangalvoice

వ్యాపార రంగంలో పద్మశాలీలు ఎదగాలి

డాక్టర్ మార్త రమేష్
ఘనంగా ‘పద్మశాలి వ్యాపార్ నెట్‌వర్క్’ మీట్

వరంగల్ వాయిస్, హైదరాబాద్ (లక్డీకాపూల్) : తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పద్మశాలీలు వ్యాపార రంగంలో విశేష అభివృద్ధి సాధించాలని, అందుకోసం పరస్పర సహకారం అవసరమని ప్రముఖ సామాజిక వేత్త డాక్టర్ మార్త రమేష్ పిలుపునిచ్చారు. హైదరాబాద్ లక్డీకాపూల్‌లోని ఎఫ్ టీసీసీఐ భవనంలో ‘పద్మశాలి వ్యాపార్ నెట్‌వర్క్ (వీపీఎన్)’ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి వ్యాపారవేత్తల సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించిన అనంతరం డాక్టర్ మార్త రమేష్ మాట్లాడుతూ.. పద్మశాలీలు తమ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకోవడానికి కొత్త వ్యూహాలతో ముందుకు సాగాలని సూచించారు. “ప్రతి పద్మశాలి వ్యాపారవేత్త తన ఎదుగుదలలో తోటి కులస్థులను భాగస్వామ్యం చేస్తూ చేయూతనందించాలి. అలా చేసినప్పుడే సమాజం నుంచి వారికి పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందుతాయి” అని ఆయన పేర్కొన్నారు. ఈ దిశగా పద్మశాలి వ్యాపార్ నెట్‌వర్క్ (వీపీఎన్) వేస్తున్న అడుగులు ఎంతో హర్షణీయమని కొనియాడారు. సామాజిక, ఆర్థిక రంగాల్లో ఆయన అందిస్తున్న సేవలకు గుర్తింపుగా, డాక్టర్ మార్త రమేష్‌ను పద్మశాలి వ్యాపార్ నెట్‌వర్క్ రాష్ట్ర సలహాదారుగా నియమిస్తూ నిర్వాహకులు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయనను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో టీఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వల్లకాటి రాజ్ కుమార్, పద్మశాలి వ్యాపార్ నెట్‌వర్క్ వ్యవస్థాపకులు ఇప్పలపల్లి రమేష్ ముఖ్య భూమిక పోషించారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో పద్మశాలి సంఘ నాయకులు, ప్రముఖ వ్యాపారవేత్తలు, విద్యావేత్తలు, యువ పారిశ్రామికవేత్తలు పాల్గొని తమ అనుభవాలను పంచుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *