Warangalvoice

టెండర్ విధానంతో చేనేత కార్మికుల పొట్ట కొట్టొద్దు

బచ్చు ఆనందం ఆగ్రహం
ప్రభుత్వ నిర్ణయంతో రోడ్డున పడనున్న వేలాది కుటుంబాలు
టెండర్లు రద్దు చేయకుంటే భారీ ఎత్తున ఉద్యమిస్తాం
హనుమకొండ జిల్లా పద్మశాలి సంఘం

వరంగల్ వాయిస్, హనుమకొండ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన కొత్త టెండర్ విధానం చేనేత కార్మికుల పాలిట శాపంగా మారబోతోందని తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం హనుమకొండ జిల్లా అధ్యక్షులు బచ్చు ఆనందం మండిపడ్డారు. మంగళవారం హనుమకొండలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేనేత రంగాన్ని నిర్వీర్యం చేస్తోందని విమర్శించారు. గత ప్రభుత్వాల హయాంలో చేనేత కార్మికులు తయారు చేసిన వస్త్రాలను టెస్కో ద్వారా నేరుగా కొనుగోలు చేసి ఉపాధి కల్పించేవారని ఆనందం గుర్తు చేశారు. కానీ ప్రస్తుత ప్రభుత్వం టెండర్ల పేరుతో ఈ రంగాన్ని ప్రైవేటు పరం చేయాలని చూడటం సిగ్గుచేటన్నారు. ఈ నిర్ణయం వల్ల వేలాది మంది కార్మికులు ఉపాధి కోల్పోయి రోడ్డున పడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. “దేశానికి అన్నం పెట్టే రైతన్న ఎంత ముఖ్యమో, మనిషికి మాన ప్రాణాలు కాపాడే వస్త్రాన్ని ఇచ్చే నేతన్న కూడా అంతే ముఖ్యం. అటువంటి రంగంపై ప్రభుత్వం చిన్నచూపు చూడటం తగదని జిల్లా అధ్యక్షుడు బచ్చు ఆనందం అన్నారు.  తక్షణమే టెండర్ విధానాన్ని విరమించుకుని, పాత పద్ధతిలోనే ప్రభుత్వమే నేరుగా వస్త్రాలను కొనుగోలు చేయాలి. పద్మశాలీలకు, చేనేత కార్మికులకు వ్యక్తిగత రుణాలు మంజూరు చేసి వారిని ఆర్థికంగా ఆదుకోవాలి.  చేనేత కార్మికుల సంక్షేమానికి ప్రత్యేక నిధులు కేటాయించి, వారిని అభివృద్ధి పథంలో నడిపించాలి. ప్రభుత్వం తన మొండి వైఖరిని వీడకుంటే చేనేత కార్మికులందరినీ ఏకం చేసి రోడ్డు ఎక్కుతామని బచ్చు ఆనందం హెచ్చరించారు. కార్మికుల పక్షాన నిలబడి టెండర్ విధానం రద్దయ్యే వరకు విశ్రమించబోమని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో అఖిల భారత పద్మశాలి సంఘం రాష్ట్ర కార్యదర్శి వైద్యం రాజగోపాల్, జిల్లా ప్రధాన కార్యదర్శి కేదాశి వెంకటేశ్వర్లు, నాయకులు నల్ల సత్యనారాయణ, బొప్ప శివశంకర్, పులికంటి రాజేందర్, గుర్రపు కోటేశ్వర్, దేవులపల్లి సదానందం, బింగి సతీష్, గుర్రపు చంద్రశేఖర్, పాము వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *