
పరకాల ఏసీపీ సతీష్ బాబు
వరంగల్ వాయిస్, దామెర : మండల పరిధిలోని మహాత్మ జ్యోతిరావు పూలే రెసిడెన్షియల్ పాఠశాలలో సోమవారం నాడు సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం ‘ఫ్రాడ్ కా ఫుల్‌స్టాప్’ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పరకాల ఏసీపీ సీ.సతీష్ బాబు, సీసీఎస్ (సైబర్ క్రైమ్ నోడల్ ఆఫీసర్) ఏసీపీ పీ.సదయ్య హాజరయ్యారు. ముఖ్య అతిథులు మాట్లాడుతూ… సైబర్ నేరాల గురించి, వాటిని అరికట్టడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి విద్యార్థినులకు వివరంగా అవగాహన కల్పించారు. సైబర్ మోసాల పట్ల విద్యార్థినులు, యువతరం చాలా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా, సైబర్ మోసాలు జరిగినప్పుడు తక్షణమే ఫిర్యాదు చేయడానికి ఉపయోగపడే సైబర్ టోల్ ఫ్రీ నంబర్ 1930 యొక్క ప్రాముఖ్యత గురించి వివరించారు. గోల్డెన్ అవర్‌లో ఫిర్యాదు చేయడం ద్వారా డబ్బు తిరిగి పొందే అవకాశాలు మెరుగుపడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ టి.గోపి, శాయంపేట సీఐ పి.రంజిత్ రావు, దామెర ఎస్సై కొంక అశోక్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ఎంజేపీ రెసిడెన్షియల్ స్కూల్ ప్రిన్సిపాల్ డి.అనిత, వారి సిబ్బందితో పాటు 450 మంది విద్యార్థినులు పాల్గొన్నారు.