Warangalvoice

రామచంద్రపురం భూ సమస్యల పరిష్కారానికి రీ-సర్వే

జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్
10,500 ఎకరాల సర్వేకు 9 బృందాల ఏర్పాటు..
రైతులు సహకరించాలని వినతి

వరంగల్ వాయిస్, మల్లంపల్లి (ములుగు జిల్లా) : మల్లంపల్లి మండల పరిధిలోని రామచంద్రపురం గ్రామంలో దశాబ్దాలుగా నెలకొన్న భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం సిద్ధమైందని ములుగు జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ ప్రకటించారు. బుధవారం రామచంద్రపురం గ్రామ రైతు వేదికలో నిర్వహించిన గ్రామసభలో ఆయన పాల్గొని, 10,500 ఎకరాల వ్యవసాయ భూమి రీ-సర్వే, హద్దుల గుర్తింపుపై రైతులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. గతంలో సాంకేతిక, ఇతర కారణాల వల్ల చాలా మంది రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు అందక తీవ్ర ఇబ్బందులు పడ్డారని గుర్తుచేశారు. ఈ సమస్యలను అధిగమించేందుకు భూములను రీ-సర్వే చేసి, పక్కాగా హద్దులు నిర్ణయించాలని నిర్ణయించినట్లు తెలిపారు. మొత్తం 10,500 ఎకరాల భూమిని 9 బ్లాకులుగా విభజించారు. సర్వే ప్రక్రియ వేగవంతం చేసేందుకు 9 ప్రత్యేక సర్వే బృందాలను రంగంలోకి దించారు. రోజుకు సగటున 50 నుంచి 75 మంది పట్టాదారుల భూములను సర్వే చేసేలా పకడ్బందీ ప్రణాళిక రూపొందించారు. భూములకు సంబంధించి హక్కులు కల్పించే ఈ బృహత్తర కార్యక్రమానికి రైతులు, గ్రామస్థులు పూర్తిస్థాయిలో సహకరించాలని కలెక్టర్ కోరారు. రీ-సర్వే పూర్తయితే రైతులకు తమ భూములపై పూర్తి స్థాయి యాజమాన్య హక్కులు లభిస్తాయని ఆయన స్పష్టం చేశారు. ఈ గ్రామసభలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) సీహెచ్.మహేందర్ జి, ఆర్డీవో వెంకటేష్, ఆత్మ కమిటీ చైర్మన్ రవీందర్ రెడ్డి పాల్గొన్నారు. అలాగే రామచంద్రపూర్, దేవ నగర్, భూపాల్ నగర్, గుర్తుర్ తండా, శివతండా సర్పంచులు దొంతి స్వరూప, సంతోష్, రమణారెడ్డి, రాజు నాయక్, భాస్కర్ తో పాటు పలువురు రెవెన్యూ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *