Warangalvoice

మార్త భిక్షపతికి ‘సేవారత్న’పురస్కారం


తిరుపతి సౌత్ ఇండియా కాన్ఫరెన్స్‌లో సత్కారం
వరంగల్ వాయిస్, పరకాల : హనుమకొండ జిల్లా పరకాల పట్టణానికి చెందిన ప్రముఖ సామాజికవేత్త మార్త భిక్షపతి ప్రతిష్టాత్మకమైన ‘సేవారత్న’ జాతీయ అవార్డుకు ఎంపికయ్యారు. బహుజన సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో తిరుపతిలో నిర్వహించిన 18వ సౌత్ ఇండియా కాన్ఫరెన్స్‌లో ఆయన ఈ పురస్కారాన్ని అందుకున్నారు. ఆదివారం జరిగిన ఈ వేడుకలో అకాడమీ జాతీయ అధ్యక్షులు నల్ల రాధాకృష్ణ, తెలంగాణ ప్రభుత్వ అడ్వైజరీ బోర్డు సభ్యులు దరువు ఎల్లన్న, అవార్డు సెలెక్షన్ కమిటీ సభ్యులు బొమ్మకంటి రాజేందర్ చేతుల మీదుగా భిక్షపతి ఈ అవార్డును స్వీకరించారు.

సామాజిక సేవలో అలుపెరుగని ప్రయాణం
        శాయంపేట మండలం గట్లకానిపర్తి గ్రామంలో జన్మించిన మార్త భిక్షపతి, 1978 నుంచే ఆర్ఎస్ఎస్, జనసంఘ్ ద్వారా సామాజిక సేవలోకి అడుగుపెట్టారు. 1980 నుంచి భారతీయ జనతా పార్టీలో క్రియాశీలక పాత్ర పోషిస్తూ, 1995లో పరకాల మేజర్ గ్రామపంచాయతీ వార్డు సభ్యుడిగా ఎన్నికై ప్రజా సేవలో తనదైన ముద్ర వేశారు. 2020-2025 కాలంలో బీజేపీ పరకాల పట్టణ అధ్యక్షుడిగా పనిచేశారు.

బహుముఖ సేవలకు గుర్తింపు
కేవలం రాజకీయాలకే పరిమితం కాకుండా, వివిధ సామాజిక విభాగాల్లో ఆయన చేసిన సేవలు అనన్యం.  పద్మశాలి సేవా సంఘం పట్టణ అధ్యక్షుడిగా, ప్రస్తుతం గౌరవ అధ్యక్షుడిగా కొనసాగుతూ కుల బాంధవుల అభివృద్ధికి కృషి చేస్తున్నారు. శ్రీనివాస చేనేత సహకార సంఘం ఉపాధ్యక్షుడిగా చేనేత కార్మికుల సమస్యల పరిష్కారంలో కీలక పాత్ర పోషిస్తున్నారు.  కోవిడ్ కష్టకాలంలో ప్రతిరోజూ సుమారు వందమందికి పైగా నిరుపేదలకు ఆహారం అందించి తన ఉదారతను చాటుకున్నారు. ఉచిత వైద్య శిబిరాల నిర్వహణ, కుటుంబ వివాదాల పరిష్కారం, గ్రామాభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన నిరంతరం ముందుంటున్నారు. తన సేవలను గుర్తించి జాతీయ స్థాయి అవార్డుకు ఎంపిక చేసినందుకు బహుజన సాహిత్య అకాడమీకి బిక్షపతి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా పరకాల పట్టణంలోని పద్మశాలి సంఘం నాయకులు, బీజేపీ శ్రేణులు, పలువురు ప్రముఖులు ఆయనను కలిసి అభినందనలు తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *