Warangalvoice

మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించాలి

జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్
ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు
బ్యాంకు లింకేజీ ద్వారా రూ. 460 కోట్ల రుణాలు..
మహిళా సంఘాల ప్రగతిపై కలెక్టర్ హర్షం

వరంగల్ వాయిస్, హనుమకొండ : మహిళలు ఆర్థికంగా బలోపేతం కావడమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందని, మహిళలు ఆర్థికాభివృద్ధి సాధిస్తేనే కుటుంబంతో పాటు గ్రామాభివృద్ధి సాధ్యమవుతుందని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ అన్నారు. బుధవారం హసన్ పర్తిలోని ‘సంస్కృతి విహార్’లో జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ (డీఆర్డీఓ), కాకతీయ మహిళా సమైక్య ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలకు ఆమె ముఖ్య అతిథిగా హాజరై, జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు.

మహిళా సంఘాల అద్భుత ప్రగతి:
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. గత రెండు దశాబ్దాలుగా మహిళలు ఆర్థిక రంగంలో అద్భుతమైన ప్రగతిని సాధిస్తున్నారని కొనియాడారు. జిల్లాలోని కాకతీయ మహిళా సమాఖ్యలో 1,16,576 మంది సభ్యులు ఉండటం, వారికి బ్యాంకు లింకేజీ ద్వారా 460 కోట్ల రూపాయల రుణాలు అందజేయడం విశేషమని పేర్కొన్నారు. మహిళా సంఘాలను మరింత బలోపేతం చేసేందుకు జిల్లాలో వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నట్లు కలెక్టర్ తెలిపారు. జిల్లాలోని 12 మండలాల్లో గ్రామ సమైక్య సంఘాల ద్వారా 12 బస్సుల కొనుగోలుకు చర్యలు తీసుకున్నామని, దీనివల్ల ఒక్కో సంఘానికి నెలకు రూ.70 వేల వరకు ఆదాయం లభిస్తుందని వివరించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు, పెట్రోల్ బంకులు, సోలార్ ప్లాంట్ల నిర్వహణలో మహిళలు క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారని ప్రశంసించారు. మన జిల్లా మహిళా సంఘాల సభ్యులు ఇతర రాష్ట్రాల్లోని సంఘాలకు శిక్షణ ఇవ్వడం గర్వకారణమని అన్నారు.

సంఘాల్లో చేరడమే భవిష్యత్తుకు మార్గం:
మహిళలు ఆర్థికంగా ఎదగడం వల్ల ఇతరులపై ఆధారపడకుండా జీవించే గౌరవం లభిస్తుందని కలెక్టర్ పేర్కొన్నారు. ఇంకా సంఘాల్లో చేరని మహిళలను చైతన్యపరిచి, వారిని భాగస్వాములను చేయాలని సూచించారు. తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లించి ఆర్థిక క్రమశిక్షణ పాటించాలని కోరారు. అనంతరం సంస్కృతి విహార్‌లో నూతనంగా నిర్మిస్తున్న కాకతీయ జిల్లా మహిళా సమాఖ్య భవన నిర్మాణ పనులను కలెక్టర్ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ వేడుకల్లో డీఆర్డీవో (డీఆర్డీఓ) మేన శ్రీను, హసన్ పర్తి తహసీల్దార్ కిరణ్ కుమార్, కాకతీయ జిల్లా మహిళా సమైక్య అధ్యక్షురాలు సుమలత, కార్యదర్శి సుజాత, వివిధ మండలాల గ్రామ సమైక్య సంఘాల సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *