Warangalvoice

కోచ్ ఫ్యాక్టరీలో స్థానికులకే ఉద్యోగాలివ్వాలి

భూములు కోల్పోయిన రైతులకు ఉపాధి కల్పించాలి
కేయూ లైబ్రరీ వద్ద నిరుద్యోగ జేఏసీ నాయకుల ధర్నా

వరంగల్ వాయిస్, హనుమకొండ/ కేయూ క్యాంపస్ : కాజీపేట (అయోధ్యపురం)లో నిర్మించిన రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో స్థానిక యువతకే ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కేయూ జేఏసీ అధ్యక్షులు డి. తిరుపతి డిమాండ్ చేశారు. మంగళవారం కాకతీయ యూనివర్సిటీ లైబ్రరీ వద్ద జేఏసీ నాయకులు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై వారు నిప్పులు చెరిగారు. కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణం కోసం అయోధ్యపురం గ్రామ రైతులు తమ జీవనోపాధి అయిన భూములను త్యాగం చేశారని తిరుపతి గుర్తు చేశారు. భూసేకరణ సమయంలో ప్రతి రైతు కుటుంబానికి ఒక ఉద్యోగం ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని, కలెక్టర్ ద్వారా 114 మంది రైతుల పేర్లను కేంద్రానికి సిఫార్సు చేసినా ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేదని మండిపడ్డారు. రెండుసార్లు కేంద్ర మంత్రులు పర్యటించినా, ఉద్యోగాల ఊసే ఎత్తకపోవడం నిరుద్యోగులను వంచించడమేనని విమర్శించారు. ఇతర రాష్ట్రాల వారిని కాకుండా, ఉమ్మడి వరంగల్ జిల్లా నిరుద్యోగులకే ఫ్యాక్టరీలో ఉద్యోగాలు ఇవ్వాలి. రైల్వేలో అప్రెంటిస్ పూర్తి చేసిన యువతకు నియామకాల్లో మొదటి ప్రాధాన్యత కల్పించాలి. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక అసెంబ్లీ సమావేశం నిర్వహించి, భూములు కోల్పోయిన వారికి ఉద్యోగాలు ఇచ్చేలా జీవో విడుదల చేసి కేంద్రానికి పంపాలి. ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజల చిరకాల వాంఛ అయిన కాజీపేట రైల్వే డివిజన్‌ను తక్షణమే ఏర్పాటు చేయాలి. కేంద్ర ప్రభుత్వం అలసత్వం వీడి, ఇతర రాష్ట్రాల్లో అనుసరిస్తున్న విధంగానే ఇక్కడ కూడా భూ నిర్వాసితులకు, అప్రెంటిస్ అభ్యర్థులకు న్యాయం చేయాలని జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో నిరుద్యోగులందరినీ ఏకం చేసి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ ఆందోళన కార్యక్రమంలో డీఎస్ఏ రాష్ట్ర కన్వీనర్ కామగోని శ్రావణ్ గౌడ్, పీడీఎస్‌యూ ఉమ్మడి జిల్లా కార్యదర్శి మర్రి మహేష్, నాయకులు రాజు, శ్రీకాంత్, అనిల్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *