Warangalvoice

SLBC Tonnel | ఎస్‌ఎల్‌బీసీలో పునరుద్ధరించిన కన్వేయర్ బెల్ట్.. కొనసాగుతున్న స్టీల్, వ్యర్థ పదార్థాల తొలగింపు

  • జిల్లాలోని ఎస్‌ఎల్‌బీసీ వద్ద సొరంగంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కన్వేయర్ బెల్ట్ పునరుద్ధరణ పనులు గురువారంతో పూర్తవడంతో శుక్రవారం నుంచి మట్టి తొలగింపు పనులను ముమ్మరం చేశారు.

వరంగల్ వాయిస్,  నాగర్ కర్నూల్ : జిల్లాలోని ఎస్‌ఎల్‌బీసీ  వద్ద సొరంగంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కన్వేయర్ బెల్ట్  పునరుద్ధరణ పనులు గురువారంతో పూర్తవడంతో శుక్రవారం నుంచి మట్టి తొలగింపు పనులను ముమ్మరం చేశారు. సొరంగం నుంచి ఉబికి వస్తున్న ఊట నీటిని తోడిపోస్తూ స్టీల్  వ్యర్ధాలను బయటకు తరలిస్తున్నారు.

శుక్రవారం టన్నెల్ లోపల జరుగుతున్న సహాయక చర్యలపై సహాయక బృందాల ఉన్నతాధికారులతో ప్రత్యేక అధికారి శివశంకర్ లోతేటి సమీక్ష నిర్వహించారు. సహాయక బృందాలు తమకు కేటాయించిన పనిని పూర్తి స్థాయిలో చేపడుతూ వేగవంతం చేస్తున్నట్లు తెలిపారు. టన్నెల్ లోపల అత్యధికంగా పేరుకుపోయిన స్టీలును లోకో ట్రైన్ ద్వారా బయటకు తరలిస్తున్నట్లు వివరించారు.

టన్నెల్ లోపల 24 గంటల పాటు 5 ఎస్కావేటర్లు స్టీలు భాగాలను, ప్రమాద ప్రదేశంలో భారీగా ఉన్న రాళ్లను లోకో ట్రైన్ ప్లాట్ ఫామ్ పైకి తరలిస్తూ, మట్టి తవ్వకాలు చేపడుతున్నారు. 100 మీటర్ల వరకు పునరుద్ధరించిన కన్వేయర్ బెల్టు ద్వారా మట్టి , బురదను బయటకు తరలిస్తున్నట్లు వివరించారు. . టన్నెల్ లోపల ఉన్న ఊట నీటిని నిరంతరం బయటకు పంపింగ్ చేస్తున్నట్లు తెలియ జేశారు. సహాయక బృందాలకు అవసరమైన వసతులను కల్పిస్తూ, ఆహారం, ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు వివరించారు.

సమీక్షలో ఆర్మీ అధికారులు వికాస్ సింగ్, విజయ్ కుమార్, సింగరేణి మైన్స్ రెస్క్యూ జనరల్ మేనేజర్ బైద్య, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ అధికారి గిరిధర్ రెడ్డి, హైడ్రా అధికారి, దక్షిణ మధ్య రైల్వే అధికారి రవీంద్రనాథ్, నీటిపారుదల శాఖ డీఈ శ్రీనివాసులు, జీఎస్‌ఐ అధికారులు రాజ్ కుమార్, జేపీ కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు.

Conveyor Belt Restored At Slbc Steel And Waste Removal Continues
Conveyor Belt Restored At Slbc Steel And Waste Removal Continues

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *