
- పలు వ్యాపారుల్లో వారి భాగస్వామ్యం
- పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క
వరంగల్ వాయిస్, ములుగు : మహిళలు ఆర్థికంగా ఎదగడానికి ప్రజా ప్రభుత్వం ప్రత్యేక కార్యచరణ రూపొందించిందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. మహిళా సాధికారతే లక్ష్యంగా అడుగులు వేస్తున్నట్లు వెల్లడించారు. గురువారం జిల్లా కేంద్రంలోని గిరిజన భవన్ లో భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, సెర్ఫ్ అదనపు సీఈఓ పి.కట్యాయని దేవి, జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్., ములుగు మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ బానోత్ రవి చందర్ లతో కలిసి మంత్రి సీతక్క ఇందిరా మహిళా శక్తి సంబరాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వడ్డీ లేని రుణాల చెక్కులు, లోన్ బీమా, ప్రమాద బీమా చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం మంత్రి సీతక్క మాట్లాడుతూ ఇందిరమ్మ కళలను నెరవేర్చడానికి కాంగ్రెస్ సర్కార్ పలు అభివృద్ధి పథకాలకు శ్రీకారం చుట్టిందన్నారు. మహిళల జీవితాల్లో వచ్చిన మార్పును గుర్తు చేసుకుంటూ సంబురాలు చేసుకునేందుకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మహిళా సంఘాలకు సుమారు రూ.26 వేల కోట్లు బ్యాంక్ లింకేజ్ రుణాలు పంపిణీ చేశామన్నారు. రాష్ట్రంలోని మహిళా సంఘాలకు లక్షల కోట్లు కేటాయించడంతో పాటు వడ్డీ మాఫీ చేసిన ఘనత తమదే అన్నారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించడానికి పలు సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టినట్లు వెల్లడించారు. ప్రభుత్వ ఉద్యోగాల కన్నా ప్రైవేట్ రంగంలో మహిళలు రాణించడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. ప్రతి ఒక్కరు ప్రభుత్వం కల్పిస్తున్న సంక్షేమ ఫలాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ములుగు నియోజకవర్గంలో తొమ్మిది మండల సమాఖ్యలు, 330 గ్రామ సమాఖ్యలు, 6,904 స్వయం సహాయక సంఘాలు, 69,736 స్వయం సహాయక సంఘాల సభ్యులున్న మహిళా సంఘాలకు బ్యాంకు లింకేజీ ద్వారా 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ.249.07 కోట్ల రుణాలు, 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను 618 స్వయం సహాయక సంఘాలకు రూ.54.79 కోట్ల రుణాలను అందించడం జరిగిందన్నారు. బ్యాంకుల ద్వారా రుణాలు పొందిన 5,109 స్వయం సహాయక సంఘాలలోని సభ్యులకు రూ.884.53 కోట్ల వడ్డీ లేని రుణాలను అందించడం జరిగిందన్నారు. 5,212స్వయం సహాయక సంఘాలలోని 52,615 మంది సభ్యులకు రూ.10.74 కోట్ల వడ్డీ లేని రుణాలను మహిళా శక్తి సంబరంలో అందించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు సంపత్ రావు, సంబంధిత అధికారులు, మండల సమాఖ్య సభ్యులు, ఏపీఎంలు, మహిళలు, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.
మృతుల కుటుంబాలకు పరామర్శ..
వెంకటా పూర్ మండలం రామాంజాపూర్ గ్రామానికి చెందిన మాజీ ఎంపీపీ బుర్ర సమ్మయ్య తల్లి ప్రథమ వర్ధంతితో పాటు అదే గ్రామానికి చెందిన డాక్టర్ రాజమౌళి తండ్రి రాగుల రాజయ్య దశ దినకర్మ గురువారం నిర్వహించారు. వేరు వేరుగా జరిగిన ఈ కార్యక్రమాలకు మంత్రి సీతక్క హాజరై చిత్ర పటాలకు పూలమాల వేసి నివాళులు అర్పించారు. సీతక్క వెంట భద్రాచలం ఏమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్ రావు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి మల్లాడి రాం రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవి చందర్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణి, బ్లాక్ కాంగ్రెస్ ములుగు అధ్యక్షులు బైరెడ్డి భగవాన్ రెడ్డి, వెంకటాపూర్ మండల అధ్యక్షులు చెన్నోజు సూర్యనారాయణ, వర్కింగ్ ప్రెసిడెంట్ బండి శ్రీనివాస్ తో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గొల్లపల్లి రాజేందర్ గౌడ్, వేముల చంద్రాకర్ రెడ్డి, దొంతరవేన కుమార్, మిల్కూరి ఐలయ్య, మామిడి శెట్టి కోటి, మారం సుమన్ రెడ్డి, కట్టేకోళ్ల వెంకటేష్, నల్ల కోటి, చెన్నోజు శ్రీను, జంగిలి రవి, మండల, గ్రామ నాయకులు కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.