
సిరికొండ మధుసూదనాచారి
మాజీ వీసీ చిత్రపటానికి నివాళులు..
కుటుంబ సభ్యులకు పరామర్శ
వరంగల్ వాయిస్, హనుమకొండ : కాకతీయ విశ్వవిద్యాలయ మాజీ ఉపకులపతి ప్రొఫెసర్ లింగమూర్తి నివాసానికి శనివారం తెలంగాణ శాసనమండలి ప్రతిపక్ష నేత, శాసనసభ మాజీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి వెళ్లారు. ఇటీవల లింగమూర్తి గారు కన్నుమూసిన నేపథ్యంలో, వారి చిత్రపటానికి పూలమాల వేసి మధుసూదనాచారి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ప్రొఫెసర్ లింగమూర్తి కుటుంబ సభ్యులను ఆత్మీయంగా పలకరించి, వారిని పరామర్శించారు. ఈ కష్టకాలంలో కుటుంబానికి భగవంతుడు ధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ సందర్భంగా మధుసూదనాచారి మాట్లాడుతూ ప్రొఫెసర్ లింగమూర్తి విద్యావేత్తగా, పరిపాలనా దక్షుడిగా కాకతీయ విశ్వవిద్యాలయ అభివృద్ధికి ఎనలేని కృషి చేశారని కొనియాడారు. విద్యార్థుల పట్ల ఆయనకు ఉన్న మక్కువ, విద్యారంగంపై ఆయనకున్న అవగాహన రాబోయే తరాలకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ఆయన మరణం ఉమ్మడి వరంగల్ జిల్లా విద్యా రంగానికి తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కేయూ విశ్రాంత ఆచార్యులు ప్రొఫెసర్ గడ్డం భాస్కర్, పలువురు విద్యావేత్తలు, రాజకీయ నాయకులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.