Warangalvoice

మహిళా శిశు సంక్షేమ కార్యక్రమాల పటిష్ట అమలు

కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్
అంగన్‌వాడీ కేంద్రాలపై నిరంతర పర్యవేక్షణ
బాల్య వివాహాల నిర్మూలనకు కఠిన చర్యలు
చైల్డ్ లైన్ (1098), సఖీ కేంద్రం సేవలపై విస్తృత ప్రచారం

వరంగల్ వాయిస్, హనుమకొండ : జిల్లాలో మహిళలు, శిశువులు, దివ్యాంగులు మరియు వయోవృద్ధుల సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు క్షేత్రస్థాయిలో అర్హులకు అందేలా అధికారులు పటిష్టంగా వ్యవహరించాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ ఆదేశించారు. శుక్రవారం హనుమకొండ కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో మహిళా శిశు సంక్షేమ శాఖ అభివృద్ధి,వివిధ కార్యక్రమాల అమలు తీరుపై ఆమె సమీక్షా సమావేశం నిర్వహించారు. సమీక్షలో భాగంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పోషకాహార లోపంతో బాధపడుతున్న (సామ్, మామ్) చిన్నారుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. వారు ఆరోగ్యవంతంగా బరువు పెరిగేలా ఐసీడీఎస్ అధికారులు నిరంతర పర్యవేక్షణ చేయాలన్నారు. అంగన్‌వాడీ కేంద్రాల భవనాలు శిథిలావస్థలో ఉంటే, ప్రత్యామ్నాయంగా వాటిని సమీపంలోని ప్రభుత్వ పాఠశాలల్లోకి మార్చే అంశాన్ని పరిశీలించాలని ఆదేశించారు.

బాల్య వివాహాల నిర్మూలనకు కార్యాచరణ

జిల్లాలో బాల్య వివాహాలను పూర్తిగా అరికట్టేందుకు పటిష్ట చర్యలు తీసుకోవాలని కలెక్టర్ స్పష్టం చేశారు. దీనిపై అవగాహన కల్పించేందుకు ఈ నెల 26న పంచాయతీ కార్యదర్శులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. బాలల రక్షణ కోసం అందుబాటులో ఉన్న చైల్డ్ లైన్ టోల్ ఫ్రీ నెంబర్ 1098, మహిళల కోసం ఉన్న ‘సఖీ’ కేంద్రం సేవలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. ‘భేటీ బచావో.. భేటీ పడావో’ కార్యక్రమానికి సంబంధించి పక్కా కార్యాచరణ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.

శాఖల వారీగా సమీక్ష

అంతకుముందు ఇన్ఛార్జి జిల్లా సంక్షేమ అధికారి విశ్వజ.. జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాల పనితీరు, అక్షయ పాత్ర భోజనం, పోషణ్ అభియాన్, పౌష్టిక ఆహార పంపిణీ, దివ్యాంగుల సంక్షేమానికి తీసుకుంటున్న చర్యలను కలెక్టర్‌కు వివరించారు. ఈ సమావేశంలో సీడీపీవోలు స్వరూప, ఉమా, ఎక్స్టెన్షన్ ఆఫీసర్ సింధురాణి, ఇంచార్జి డీసీపీవో ప్రవీణ్ కుమార్, ఎఫ్ఆర్‌వో రవికృష్ణ, సఖీ కేంద్రం అడ్మిన్ హైమావతి, శిశు గృహ మేనేజర్ మాధవి, చైల్డ్ లైన్ కో-ఆర్డినేటర్ భాస్కర్, డీహెచ్‌డబ్ల్యూ కో-ఆర్డినేటర్ కళ్యాణి, ఐసీడీఎస్ సూపర్వైజర్లు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *