
వరంగల్ వాయిస్, దామెర : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక” 99 రోజుల కార్యక్రమంలో భాగంగా శనివారం దామెర మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ‘క్లీన్ అండ్ గ్రీన్’ ప్రోగ్రామ్‌ను నిర్వహించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు కార్యాలయ ప్రాంగణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు అధికారులు ప్రత్యేక చొరవ తీసుకున్నారు. పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కాపాడుకోవడమే లక్ష్యంగా ఎంపీడీఓ గుమ్మడి కల్పన, సూపరింటెండెంట్ సబ్జా రాణి, పంచాయతీ కార్యదర్శి మనోహర్ లు స్వయంగా ఈ పారిశుధ్య పనుల్లో పాల్గొన్నారు. కార్యాలయ పరిసరాల్లో పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని తొలగించి, మొక్కలకు నీరు పోస్తూ పరిసరాలను శుభ్రం చేశారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ కల్పన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, అప్పుడే ఆరోగ్యకరమైన సమాజం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ప్రభుత్వ కార్యాలయాలు ప్రజలకు ఆదర్శంగా నిలవాలనే ఉద్దేశంతో ఈ క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. 99 రోజుల ప్రగతి ప్రణాళికలో భాగంగా మండల వ్యాప్తంగా మరిన్ని అభివృద్ధి మరియు పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహిస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ కార్యాలయ సిబ్బంది, ఇతర రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.