
వరంగల్ వాయిస్, వరంగల్ : అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని వరంగల్ ఎల్బీనగర్లోని ‘లర్నర్స్ ల్యాండ్’ పాఠశాలలో శనివారం ముందస్తు వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రాంగణంలో జరిగిన ఈ ప్రత్యేక కార్యక్రమం మహిళా శక్తిని, ఐక్యతను చాటిచెప్పేలా సాగింది. ఈ సందర్భంగా పాఠశాల మహిళా ఉపాధ్యాయులు మాట్లాడుతూ.. నేటి సమాజంలో మహిళలు కేవలం గృహిణులుగా మాత్రమే కాకుండా విజ్ఞానం, వైద్యం, క్రీడలు, విద్య వంటి అనేక రంగాలలో అద్భుతమైన విజయాలు సాధిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారని కొనియాడారు. ధైర్యం, పట్టుదలతో ముందుకు సాగితే మహిళలు అసాధ్యాలను సైతం సుసాధ్యం చేయగలరని వారు ఆకాంక్షించారు. మహిళా దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులందరూ కలిసి కేక్ కట్ చేసి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. పాఠశాల కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగిన ఈ వేడుకలు అత్యంత సంతోషభరిత వాతావరణంలో జరిగాయి. మహిళల ప్రాముఖ్యతను చాటుతూ నిర్వహించిన ఈ కార్యక్రమం విద్యార్థుల్లోనూ స్ఫూర్తిని నింపింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం, సిబ్బంది పాల్గొన్నారు.