Warangalvoice

నిరుపేద కుటుంబానికి అండగా ‘పేదల వకీల్’


25 కిలోల బియ్యం అందజేత
వరంగల్ వాయిస్, గోవిందరావుపేట : నిరుపేద కుటుంబాల్లో విషాదం నెలకొన్నప్పుడు మానవత్వంతో స్పందించి ఆదుకోవడంలో యువత, స్వచ్ఛంద సంస్థలు ముందుండాలని అసైన్డ్ భూమి సమితి వ్యవస్థాపక అధ్యక్షులు, అడ్వకేట్ కలకోటి మహేందర్ పిలుపునిచ్చారు. ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం బుస్సాపూర్ గ్రామానికి చెందిన తిప్పారపు దుర్గమ్మ (75) ఇటీవల అనారోగ్యంతో మరణించారు. ఈ విషయం తెలుసుకున్న మహేందర్ శనివారం వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రజా సంఘాల జేఏసీ నాయకుడు, ములుగు జిల్లా సాధన సమితి అధ్యక్షుడు ముంజల భిక్షపతి గౌడ్ ఆధ్వర్యంలో మృతురాలి కుటుంబానికి 25 కిలోల బియ్యాన్ని అందజేశారు. ఈ సందర్భంగా భిక్షపతి గౌడ్ మాట్లాడుతూ.. కష్టాల్లో ఉన్న పేదలకు తనవంతు సాయం అందిస్తూ కలకోటి మహేందర్ ‘పేదల వకీల్ సాబ్’గా ప్రజల గుండెల్లో నిలుస్తున్నారని కొనియాడారు. అడ్వకేట్ కలకోటి మహేందర్ మాట్లాడుతూ.. రాకెట్ యుగంలోనూ కనీసం నిలువ నీడ లేని నిరుపేదలు ఉండటం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. అర్హులైన ఇలాంటి కుటుంబాలకు ప్రభుత్వం తక్షణమే అండగా నిలిచి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ములుగు జిల్లా కళాకారుల సంఘం అధ్యక్షుడు గోల్కొండ బుచ్చన్న, మృతురాలి కుటుంబ సభ్యులు తిప్పారపు నరసయ్య, శంకర్, సునీత, నావిక, నగేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *