
వరంగల్ వాయిస్, కమలాపూర్ : ధనుర్మాస ముగింపు వేడుకలు, భోగి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని స్థానిక శ్రీ సీతా రామచంద్రస్వామి దేవాలయంలో గోదాదేవి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. భక్తిశ్రద్ధలతో నిర్వహించిన ఈ ఆధ్యాత్మిక వేడుకను వీక్షించేందుకు గ్రామస్తులు, భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆలయ ప్రాంగణంలో రంగనాథ స్వామి మరియు గోదాదేవి (ఆండాళ్ అమ్మవారు) ఉత్సవ విగ్రహాలకు ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి, నూతన వస్త్రాలతో సుందరంగా అలంకరించారు. అనంతరం వేద పండితులు మంగళ వాయిద్యాల మధ్య, శాస్త్రోక్తంగా కళ్యాణ ఘట్టాన్ని పూర్తి చేశారు. భక్తుల గోవింద నామస్మరణతో ఆలయమంతా ఆధ్యాత్మిక శోభతో విలసిల్లింది.ఈ విశిష్ట పూజా కార్యక్రమాలను అర్చకులు పరాశరం సత్యనారాయణ చార్యులు, పరాశరం రామాచార్యులు, పరాశరం వెంకటాచార్యులు, రాఘవ చార్యులు, కందడై తిరువెంగలా చార్యులు సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామి వారిని దర్శించుకున్న భక్తులకు తీర్థ ప్రసాద వితరణ చేపట్టారు. గ్రామంలోని భక్తులు ఉత్సాహంగా పాల్గొని ఉత్సవాన్ని దిగ్విజయం చేశారు.