
హాజరైన పర్వతగిరి ఎస్ఐ ప్రవీణ్, సర్పంచ్ మహేందర్
వరంగల్ వాయిస్, పర్వతగిరి: అన్నారంలోని పల్లవి మోడల్ స్కూల్లో శుక్రవారం ముందస్తు సంక్రాంతి సంబరాలు అత్యంత వైభవంగా జరిగాయి. పాఠశాల చైర్మన్ అశోక్ చారి, కరస్పాండెంట్ గంజి మహేందర్, డైరెక్టర్ కోటగిరి రమేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలు గ్రామస్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పర్వతగిరి ఎస్ఐ ప్రవీణ్, అన్నారం సర్పంచ్ గాడిపెళ్లి మహేందర్ హాజరయ్యారు. అతిథులు విద్యార్థులతో కలిసి గాలిపటాలు ఎగురవేసి, భోగి మంటల వద్ద సందడి చేస్తూ వారిని ఉత్సాహపరిచారు. ఈ సందర్భంగా విద్యార్థులు వివిధ కుల వృత్తులను ప్రతిబింబించేలా వేషధారణలతో అలరించారు. హరిదాసులు, బసవన్నల రాకతో పాఠశాల ప్రాంగణం ఒక కుగ్రామాన్ని తలపించింది. విద్యార్థినులు వేసిన రంగోళి (ముగ్గుల) పోటీలు వారి ప్రతిభకు అద్దం పట్టాయి. సంక్రాంతి పాటలకు విద్యార్థులు చేసిన నృత్యాలు అందరినీ మంత్రముగ్ధులను చేశాయి. బాలురు తాడు గుంజుడు పోటీల్లో ఉత్సాహంగా పాల్గొని సందడి చేశారు. ఎడ్ల బండి ప్రదర్శన, గాలిపటాల పోటీలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అతిథులు మాట్లాడుతూ.. ఇలాంటి వేడుకల ద్వారా నేటి తరం విద్యార్థులకు మన భారతీయ సంప్రదాయాలు, పండుగల విశిష్టత తెలుస్తుందని కొనియాడారు. చదువుతో పాటు మన మూలాలను గౌరవించడం నేర్పడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.