
వరంగల్ వాయిస్, దామెర : ముఖ్యమంత్రి కప్ క్రీడా పోటీల సందడి మండలంలో మొదలైంది. పోటీల ప్రాముఖ్యతను చాటిచెబుతూ శుక్రవారం దామెర మండలంలోని ఊరుగొండ, ఒగ్లాపూర్, దామెర గ్రామ పంచాయతీల్లో ‘సీఎం కప్ టార్చ్ ర్యాలీ’ అత్యంత ఉత్సాహంగా జరిగింది. జిల్లా యువజన క్రీడల అధికారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ర్యాలీకి క్రీడాకారులు, విద్యార్థులు, యువత భారీ సంఖ్యలో తరలివచ్చారు. మండలంలోని ప్రధాన గ్రామాల్లో సాగిన ఈ టార్చ్ ర్యాలీకి ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు ఘనస్వాగతం పలికారు. క్రీడా జ్యోతిని చేతబూని క్రీడాకారులు ఉత్సాహంగా పరుగులు తీశారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడా నైపుణ్యాన్ని వెలికితీయడమే సీఎం కప్ ప్రధాన ఉద్దేశమని, యువత ఈ పోటీల్లో పెద్ద ఎత్తున పాల్గొని తమ ప్రతిభను చాటాలని పిలుపునిచ్చారు. గ్రామీణ క్రీడాకారులకు ఈ పోటీలు ఒక గొప్ప వేదికని, క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసాన్ని, క్రమశిక్షణను పెంచుతాయని పేర్కొన్నారు. మండల వ్యాప్తంగా క్రీడా వాతావరణాన్ని పెంపొందించేలా ఈ ర్యాలీని విజయవంతం చేసిన అందరికీ ఎంపీడీవో కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో దామెర ఎంపీడీవో గుమ్మడి కల్పన, పంచాయతీ కార్యదర్శి నరేష్, ఒగ్లాపూర్ గ్రామ సర్పంచి శ్రీధర్ రెడ్డి, దామెర ఎస్సై కొంక అశోఖ్, ఎంఈఓ రాజేష్ నాయక్, ఊరుగొండ సర్పంచ్ శ్రీనివాస్, మండల అధికారులు, క్రీడాకారులు, వ్యాయామ ఉపాధ్యాయులు, గ్రామస్థులు పాల్గొన్నారు.