
కునారిల్లుతున్న తక్కళ్ళపహాడ్ – ఆగ్రంపహాడ్ మార్గం
కలెక్టర్‌కు సర్పంచ్ దాడి వసంత రమేష్ వినతి
వరంగల్ వాయిస్,దామెర : ప్రసిద్ధ పుణ్యక్షేత్రం, మినీ మేడారంగా పిలవబడే ఆగ్రంపహాడ్ శ్రీ సమ్మక్క-సారలమ్మ జాతర సమీపిస్తున్న తరుణంలో, భక్తులు ప్రయాణించే ప్రధాన రహదారి అధ్వానంగా మారడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. తక్కళ్లపహాడ్ మీదుగా జాతరకు వెళ్లే బీటీ.రోడ్డు పనులు అసంపూర్తిగా నిలిచిపోవడంతో భక్తులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యపై తక్కళ్లపహాడ్ గ్రామ సర్పంచ్ దాడి వసంత రమేష్ మంగళవారం హనుమకొండ జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. గతంలో కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ (కుడా) ద్వారా ఈ రోడ్డు నిర్మాణం కోసం సుమారు రూ.86 లక్షల నిధులు మంజూరయ్యాయని, అయితే పనులు సగంలోనే ఆగిపోవడంతో రోడ్డు ప్రస్తుతం కంకర తేలి భారీ గుంతలతో దర్శనమిస్తోందని సర్పంచ్ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యంగా వాగు వంతెన వద్ద రోడ్డు వర్షాలకు కొట్టుకుపోయి రాకపోకలు సాగించడం ప్రమాదకరంగా మారిందని వివరించారు. వరంగల్, హనుమకొండ, కరీంనగర్ జిల్లాల నుంచి వేలాది మంది భక్తులు వనదేవతల దర్శనానికి ఈ మార్గం గుండానే తరలివస్తుంటారని, జాతర లోపు రోడ్డుకు మరమ్మత్తులు చేయించకుంటే తీవ్ర ఇబ్బందులు తప్పవని విన్నవించారు. జాతర విజయవంతం కోసం యుద్ధ ప్రాతిపదికన రోడ్డు పనులు పూర్తి చేయించాలని గ్రామస్థుల తరపున ఆమె కోరారు. కలెక్టర్ సానుకూలంగా స్పందించి తక్షణమే చర్యలు చేపట్టాలని భక్తులు,యు స్థానిక ప్రజలు కోరుతున్నారు.