
వరంగల్ వాయిస్, దామెర : సమాజంలో అణగారిన వర్గాలైన ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఐక్యంగా ఉన్నప్పుడే హక్కుల సాధన సాధ్యమవుతుందని సామాజిక నాయకులు వేల్పుల శ్రీనివాస్ అన్నారు. శనివారం దామెర మండలంలోని ల్యాదెళ్ల గ్రామంలో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ముఖ్యంగా బ్యాండు మాస్టర్స్, బ్యాండు కార్మికులు అందరూ ఒకే తాటిపైకి రావాలని ఆయన పిలుపునిచ్చారు. “మనమే బ్యాండు మాస్టర్లుగా ఎదగాలి, మన వృత్తిలో మనం ఐక్యతను చాటుకోవాలి” అని ఆయన పేర్కొన్నారు. కేవలం వృత్తిపరంగానే కాకుండా, సామాజికంగా కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలు ఒకరికొకరు తోడుగా ఉండాలని కోరారు. ఐక్యత ద్వారానే మన సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లగలమని, భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాల ద్వారా ఈ వర్గాలను చైతన్యపరుస్తామని శ్రీనివాస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సుధాకర్, రాము, లక్ష్మణ్, స్థానిక బ్యాండు కార్మికులు పాల్గొన్నారు.