Warangalvoice

చెడుపై మంచి సాధించిన విజయమే విజయదశమి| Sundarraj Yadhav

  • కుడా మాజీ చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్

వరంగల్ వాయిస్, న్యూజెర్సీ : చెడుపై మంచి సాధించిన విజయమే విజయదశమి అని ఓబీసీ చైర్మన్, కుడా మాజీ చైర్మన్ సంగంరెడ్డి సుందర్ రాజ్ యాదవ్ అన్నారు. అమెరికాలోని న్యూజెర్సీలో అమెరికా తెలుగు సంఘం ఆధ్వర్యంలో రాయల్ ఆల్బర్ట్స్ ప్యాలెస్‌లో నిర్వహించిన దసరా వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సుందర్ రాజ్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ… ఖండాంతరాలు దాటి, కనీవినీ ఎరుగని రీతిలో ప్రవాస భారతీయులతో కలిసి దసరా సంబరాలు జరుపుకోవడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని తెలిపారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవడం మనందరి బాధ్యత అని ఆయన ఉద్ఘాటించారు. పెద్ద సంఖ్యలో ఎన్నారైలు కుటుంబ సభ్యులతో పాల్గొని శమీ పూజతో పాటు ఆటపాటలతో సందడి చేయడం సంతోషంగా ఉందన్నారు. మన తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించడంతో పాటు, తెలుగువారి ఐక్యతతో ఇంత పెద్ద కార్యక్రమాన్ని నిర్వహించడం గొప్ప విషయమని కొనియాడారు. ఈ వేడుకల్లో రామలీల ప్రదర్శనలు, నృత్యాలు, సంగీత కచేరీలు వంటి సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం గొప్ప విషయమని సుందర్ రాజ్ యాదవ్ గుర్తు చేశారు. ఈ దసరా ఉత్సవాలలో ఎన్నారైలు, ‘బలగం’ మూవీ బెస్ట్ లిరిక్స్ అవార్డు గ్రహీత కాసర్ల శ్యామ్, ఫోక్ సింగర్స్ రేలారే గంగా, దాండియా శ్రీను తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ధూంధాం, జానపద గేయాలు, సినిమా పాటలతో దసరా వేడుకలను అంగరంగ వైభవంగా జరుపుకున్నారు.
విదేశాలలో ఉంటూ భారతీయ సంస్కృతి, సంప్రదాయాలతో ప్రతి ఏటా ఇలాంటి కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరుపుకోవాలని సుందర్ రాజ్ యాదవ్ ఆకాంక్షించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *