Warangalvoice

పేద, మధ్యతరగతికి జీఎస్టీ పండుగ

  • మోదీ ప్రభుత్వం  పండుగ గిఫ్ట్
  • భారీగా  జీఎస్టీ తగ్గింపు
  • రైతులకు, విద్యార్థులకు ఊరట
  • మీడియా సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్

వరంగల్ వాయిస్, (వరంగల్, సెప్టెంబర్ 22): నూతనంగా సవరించిన జీఎస్టీ శ్లాబులు ఈరోజు నుంచి అమలులోకి వస్తున్నాయని, ఈ నిర్ణయం పేద, మధ్యతరగతి ప్రజలకు డబుల్ బోనంజా లాంటిదని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ అన్నారు. మేక్ ఇన్ ఇండియాను ప్రోత్సహిస్తూ, స్వదేశీ వస్తువులను కొనుగోలు చేయాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. జీఎస్టీ సంస్కరణలతో దేశం మరింత శక్తివంతం అవుతుందని, ఈ నిర్ణయం తీసుకున్నందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి వరంగల్ జిల్లా ప్రజల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

ఈరోజు రాష్ట్ర పార్టీ సూచనల మేరకు, నెక్స్ట్ జెన్ జీఎస్టీ అభియాన్ జిల్లా కన్వీనర్ రత్నం సతీష్ షా ఆధ్వర్యంలో ఎల్.బి. నగర్‌లోని రాయన్ ప్యాలెస్ హాల్‌లో మీడియా సమావేశం జరిగింది. ఈ సమావేశానికి జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్, మాజీ శాసనసభ్యులు ఆరూరి రమేష్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎర్రబెల్లి ప్రదీప్ రావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

మోదీ ప్రభుత్వం నిజమైన పండుగ గిఫ్ట్ ఇచ్చింది : ఆరూరి రమేష్

మాజీ శాసనసభ్యులు ఆరూరి రమేష్ మాట్లాడుతూ, నరేంద్ర మోదీ ప్రభుత్వం ఎప్పుడూ పేదల సంక్షేమాన్ని ధ్యేయంగా పెట్టుకుని పని చేస్తోందని అన్నారు.

పేద, మధ్యతరగతి కుటుంబానికి నేరుగా లాభం: రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎర్రబెల్లి ప్రదీప్ రావు 

జీఎస్టీ రేట్ల తగ్గింపుతో ప్రతి పేద, మధ్యతరగతి కుటుంబానికి నేరుగా లాభం చేకూరబోతోందని రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎర్రబెల్లి ప్రదీప్ రావు తెలిపారు.వారు ఇంకా మాట్లాడుతూ, మోదీ ప్రభుత్వం పేదలు, రైతులు, విద్యార్థులు, మధ్యతరగతి కుటుంబాలు, MSME ల జీవితాలను సులభతరం చేయడానికి అనేక వస్తువులపై జీఎస్టీని గణనీయంగా తగ్గించిందని పేర్కొన్నారు. ఉదాహరణకు, 28% ఉన్న జీఎస్టీని 18%కి, 18% ఉన్నది 5%కి, 12% ఉన్నది 5%కి, 18% ఉన్నది 0%కి తగ్గించారు.

మహిళలు, గృహిణులకు ఉపశమనం: ఇంటి ఖర్చులు తగ్గడం వల్ల పండుగల్లో మరింత సంతోషం వచ్చిందని మహిళలు, గృహిణులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దినసరి అవసరాలైన సబ్బులు, షాంపూలు, పేస్టులు, డైపర్లు వంటి వాటిపై జీఎస్టీ 18% నుంచి కేవలం 5%కి తగ్గింది. వెన్న, పన్నీర్, బిస్కెట్లు కూడా ఇప్పుడు తక్కువ ధరలకు లభిస్తున్నాయి.

రైతులకు ప్రోత్సాహం: వ్యవసాయ యంత్రాలు, కోత, విత్తనాల పరికరాలపై పన్ను తగ్గడం వల్ల రైతులకు ఖర్చులు తగ్గి, ఆదాయం పెరగనుంది. ట్రాక్టర్ టైర్లు, బయో-పెస్టిసైడ్స్, డ్రిప్ ఇరిగేషన్ వంటి వాటిపై జీఎస్టీ 18% నుంచి 5%కి తగ్గింది. ఇది మోదీ ప్రభుత్వం రైతు స్నేహపూర్వక ప్రభుత్వం అని మరోసారి నిరూపించిందని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

విద్యార్థులకు భారం తగ్గింది: విద్యార్థులకు ఉపయోగపడే మ్యాప్స్, గ్లోబ్స్, పుస్తకాలు, నోట్‌బుక్స్, పెన్సిల్స్, ఎరాజర్లు వంటి వాటిపై జీఎస్టీ పూర్తిగా మినహాయించబడింది. దీంతో విద్య ఖర్చులు గణనీయంగా తగ్గుతాయి.

ఆరోగ్యానికి భరోసా: థర్మామీటర్లు, మెడికల్ ఆక్సిజన్, డయాగ్నస్టిక్ కిట్స్, గ్లూకోమీటర్లు, కళ్లద్దాలు వంటి వాటిపై జీఎస్టీ 18% లేదా 12% నుంచి 5%కి తగ్గింది. హెల్త్, లైఫ్ ఇన్సూరెన్స్ పై జీఎస్టీ పూర్తిగా NIL కి తగ్గించారు. దీంతో పేదలకు వైద్యం భారం కాకుండా ఆశీర్వాదం అవుతుంది.

వాహనాలు, ఎలక్ట్రానిక్స్ చౌకగా: సామాన్యుల కలల వాహనాలైన పెట్రోల్, డీజిల్ హైబ్రిడ్ కార్లు, ద్విచక్ర వాహనాలు, లారీలు, ట్రక్కులు, అంబులెన్స్ వంటి వాటిపై జీఎస్టీ 28% నుంచి 18%కి తగ్గింది. అలాగే ఏసీలు, టీవీలు, ప్రొజెక్టర్లు, డిష్ వాషింగ్ మెషిన్లు వంటి ఎలక్ట్రానిక్స్ వస్తువులు కూడా ఇప్పుడు మరింత చౌకగా లభిస్తాయి.

కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు : కాంగ్రెస్ పాలనలో పెరిగిన ధరలు, పన్నుల భారం వల్ల ప్రజలు ఇబ్బందులు పడ్డారని, మోదీ గారి జీఎస్టీ సంస్కరణలు వారికి ఊరట కలిగించాయని నేతలు అన్నారు. ఈ నిర్ణయం పేదల అభ్యున్నతి పట్ల మోదీ ప్రభుత్వ నిబద్ధతకు నిలువుటద్దం లాంటిదని తెలిపారు. అయితే, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం పెట్రోల్, డీజిల్‌పై భారీ పన్నులు కొనసాగిస్తూ ప్రజల జేబులపై భారం మోపుతోందని నేతలు విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పెట్రోల్, డీజిల్‌ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. గతంలో రాహుల్ గాంధీ జీఎస్టీని “గబ్బర్ సింగ్ ట్యాక్స్” అని విమర్శించినా, ఇప్పుడు మోదీ ప్రభుత్వం జీఎస్టీ ద్వారా పన్నులు తగ్గించిందని, నిజంగా ప్రజలపై భారం మోపుతోంది కాంగ్రెస్ పాలిత రాష్ట్ర ప్రభుత్వాలే అని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో నెక్స్ట్ జెన్ జీఎస్టీ అబియాన్ కో కన్వీనర్లు కూచన క్రాంతి కుమార్, వడ్డేపల్లి నరసింహులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వన్నాల వెంకటరమణ, జిల్లా ప్రధాన కార్యదర్శులు బాకం హరిశంకర్, మల్లాడి తిరుపతిరెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు గడల కుమార్, పట్టాపురం ఏకాంతం గౌడ్, బిజెపి సీనియర్ నాయకులు సముద్రాల పరమేశ్వర్, ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బైరి మురళీకృష్ణ, ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు పోలేపాక మార్టిన్ లూథర్, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు కందిమల్ల మహేష్, బీజేవైఎం జిల్లా అధ్యక్షులు ఎర్రగొల్ల భరత్ వీర్, మండల అధ్యక్షులు అపురూప రజనీష్ తో పాటు బిజెపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *