Warangalvoice

విజయ్‌ అభిమానులకు పండగ

  • ప్రేక్షకులను ఆకట్టుకునేలా కింగ్డమ్‌

వరంగల్ వాయస్ (సినిమా):  వరుస సినిమాలు చేస్తున్నా, బాక్సాఫీస్‌ వద్ద మేజిక్‌ క్రియేట్‌ చేయడంలో తడబడుతున్నారు. ఈ నేపథ్యంలో గౌతమ్‌ తిన్ననూరితో కలిసి ఆయన చేసిన తాజా చిత్రం ’కింగ్డమ్‌’ గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక కథలోకి వెళితే…సూరి (విజయ్‌ దేవరకొండ) ఓ కానిస్టేబుల్‌. చిన్న వయసులోనే కుటుంబానికి దూరమైన తన అన్న శివ (సత్యదేవ్‌) జాడ కోసం వెతుకుతుంటాడు. ఆ ప్రయత్నంలో ఉండగానే పోలీస్‌ అధికారులకీ సూరికి మధ్య గొడవ జరుగుతుంది. అది తన పై అధికారుల వరకూ వెళ్తుంది. అందుకు సంబంధించి విచారణ జరుగుతున్నప్పుడు ఊహించని రీతిలో సూరికి ఓ మిషన్‌ బాధ్యతల్ని అప్పజెబుతారు. సూరి వెతుకుతున్న తన అన్న శివ ఆచూకీ శ్రీలంక సవిూపంలోని దివి అనే ఓ ద్వీపంలో ఉందని, గూఢచారిగా అక్కడ పనిచేయాలని చెబుతారు. తన అన్న కోసం ఎంత దూరమైనా వెళ్లడానికి సిద్ధమైన సూరి… పై అధికారి చెప్పినట్టే శ్రీలంకలో అడుగు పెడతాడు. అత్యంత ప్రమాదకరమైన స్మగ్లింగ్‌ కార్టెల్‌ అదుపాజ్ఞల్లో ఉన్న దివిలోకి సూరి ఎలా అడుగు పెట్టాడు?ఇంతకీ శివ ఆ దివికి ఎందుకు వెళ్లాడు? ఆ ద్వీపంలో ఉన్న తెగకీ, శివకీ సంబంధం ఏమిటి? అక్కడి తెగ 70ఏళ్లుగా ఎవరి రాకకోసం ఎదురు చూస్తూ ఉంటుంది? తన అన్నతో కలిసి సూరి తిరిగొచ్చాడా?అన్నది చిత్ర కథ. అన్నదమ్ముల చుట్టూ తిరిగే గ్యాంగ్‌స్టర్‌ డ్రామా ఇది. తెలుగులో ఇలాంటి కథలు కొత్తేవిూ కాదు కానీ, మిగతావాటితో పోలిస్తే దీనిలో అన్నదమ్ముల బంధం, ద్వీపంలో చిక్కుకుపోయిన ఓ తెగ నేపథ్యమే ’కింగ్డమ్‌’ను భిన్నంగా నిలుపుతుంది. గ్యాంగ్‌స్టర్‌ కథలకి డ్రామా కీలకం. ఆ విషయంలో దర్శకుడు గౌతమ్‌ తిన్ననూరి రచన బలమైన ప్రభావమే చూపిస్తుంది. డ్రామాతోపాటు కథా ప్రపంచంలో లీనం చేసే విజువల్స్‌, వాటికి మరింత బలాన్నిచ్చే సంగీతం, తెరపైన పాత్రలు తప్ప నటులే కనిపించని అభినయాలు… ఇలా అన్నీ ఉన్నా ఆ స్థాయిలో భావోద్వేగాలు బలంగా పండిరచలేకపోయారు. 1920ల నాటి నేపథ్యాన్ని తెరపై ఆవిష్కరిస్తూ కథని ఆసక్తికరంగా మొదలు పెట్టాడు దర్శకుడు. తొలి సన్నివేశంతోనే ’కింగ్డమ్‌’ ప్రపంచంలో లీనమయ్యేలా చేశారు. ఆ తర్వాత కానిస్టేబుల్‌గా సూరి జీవితం, అన్న జాడ కోసం అతను చేసే ప్రయత్నాలు, ఆ తర్వాత మిషన్‌ బాధ్యతల్ని భుజాన వేసుకునే సన్నివేశాలతో సినిమా వేగంగానే పరుగులు పెడుతుంది. కథ శ్రీలంకకి మారాక జాఫ్నా జైలు నేపథ్యంతో పాటు, సూరి, శివ… తాము అన్నదమ్ములమనే విషయం ఇద్దరికీ ఎప్పుడు తెలుస్తుందనే అంశాలు ప్రేక్షకుల్లో ఆత్రుతని, ఆసక్తిని రేకెత్తిస్తాయి. అడుగడుగునా నాటకీయతతో సన్నివేశాల్ని మలిచినా, కథకు ప్రధానంగా అవసరమైన భావోద్వేగాల్ని ఆవిష్కరించలేకపోయారు. కథ నుంచి పక్కకు వెళ్లకుండా సన్నివేశాల్ని తీర్చిదిద్దడం సినిమాకు కలిసొచ్చింది. పతాక సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. ’కింగ్డమ్‌’ ప్రపంచాన్ని ఆవిష్కరించడంలో నటీనటులు, సాంకేతిక బృందం పడిన శ్రమతో తెరపై స్పష్టంగా కనిపిస్తుంది. విజయ్‌ దేవరకొండలో ఎంత మంచి నటు-డు ఉన్నాడో మరోసారి రుజువు చేసే చిత్రమిది. సూరి పాత్రలో ఒదిగిపోయాడు. తెరపైన ఎక్కడా విజయ్‌ కనిపించలేదు. ఆరంభ సన్నివేశాలతో కలుపుకొంటే, తెరపైన మూడు కోణాల్లో కనిపిస్తారు. ప్రతి కోణంపైనా తనదైన ముద్రవేశారు. ముఖ్యంగా స్పై పాత్ర కోసం ఆయన మారిపోయిన విధానం, శ్రీలంక నేపథ్యంలో సాగే ఆ సన్నివేశాలపై బలమైన
ప్రభావం చూపించారు. శివ పాత్రలో సత్యదేవ్‌ నటన మరో ప్రధాన ఆకర్షణ. ఈ ఇద్దరి తర్వాత సినిమాలో కనిపించే మరో కీలకమైన పాత్ర… మురుగన్‌. ఆ పాత్రలో మలయాళ నటుడు వెంకటేశ్‌ చాలా బాగా నటించారు. స్మగ్లింగ్‌ కార్టెల్‌ని నడిపే యువ నాయకుడిగా కనిపిస్తాడు. కథానాయిక భాగ్యశ్రీ బోర్సే పాత్రకి పెద్దగా ప్రాధాన్యం లేదు. సాంకేతికంగా.. సినిమా ఉన్నతంగా ఉంది. విజువల్స్‌ పరంగా ప్రతి ఫ్రేమ్‌ ఆకట్టుకుంటుంది. అనిరుధ్‌ నేపథ్య సంగీతం సినిమాకి ప్రధానబలం. మేకింగ్‌ విషయంలో దర్శకుడి ప్రతిభ అడుగడుగునా కనిపిస్తుంది. మొత్తంగా విజయ్‌ అభిమానులకు పండగలాంటి సినిమా అని చెప్పవచ్చు.

మనమే కొట్టినాం.. రష్మిక ట్వీట్‌
విజయ్‌ దేవరకొండ నటించిన తాజా చిత్రం ’కింగ్‌డమ్‌’ విడుదలై, అద్భుతమైన స్పందనను అందుకుంటోంది. అభిమానులూ, ఇండస్ట్రీ వాళ్లు సోషల్‌ విూడియాలో హర్షధ్వానాలు చేస్తున్న వేళ, ఓ ఎమోషనల్‌ ట్వీట్‌ అందరినీ ఆకట్టుకుంటోంది. తాజాగా నేషనల్‌ క్రాష్‌ రష్మిక మందన్న ’నీకూ, నిన్ను ప్రేమించే ప్రతి ఒక్కరికి ఇది ఎంత ముఖ్యమో నాకు తెలుసు విజయ్‌.. మనమే కొట్టినాం కింగ్‌డమ్‌. అని ట్వీట్‌ చేసింది. ఈ మాటల వెనుక ఉన్న భావం సూటిగా హృదయాలను తాకుతుంది. ముఖ్యంగా ‘మనమే కొట్టినాం‘ అన్న మాటలో గర్వం, భావోద్వేగం రెండూ సమపాళ్లలో ఉన్నాయి. తాజాగా ఈ ట్వీట్‌ సోషల్‌ విూడియాలో బాగా వైరల్‌ అవుతుంది. ఇక కింగ్‌డమ్‌ చిత్రం ప్రస్తుతానికి పాజిటివ్‌ టాక్‌తో దూసుకెళ్తోంది.


కింగడమ్‌ని మెచ్చుకున్న హిమాన్షు
లవ్‌ ఎమోజీతో ఐలవ్‌యూ అంటూ విజయ్‌ రిప్లై
స్టార్‌ కథానాయకుడు విజయ్‌ దేవరకొండ నటించిన కింగ్‌డమ్‌ చిత్రంను బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ కొడుకు హిమాన్షు రావు వీక్షించాడు. ఈ సినిమాపై ప్రశంసలు కురిపించాడు. ఈ సందర్భంగా ఎక్స్‌ వేదికగా పోస్ట్‌ పెట్టాడు. ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో నా స్నేహితులతో కలిసి ‘కింగ్‌డమ్‌‘ సినిమా చూశాను. ఒక థియేటర్‌లో ఇంత మంచి అనుభూతి పొందడం నాకు ఇదే మొదటిసారి!. అలాగే ఈ సినిమాలో విజయ్‌ దేవరకొండ నటన అద్భుతంగా ఉంది. సినిమా అయితే నాకు చాలా నచ్చిందంటూ హిమాన్షు రాసుకొచ్చాడు. అయితే ఈ పోస్ట్‌పై విజయ్‌ స్పందిస్తూ.. హిమాన్షు లవ్‌ యూ అంటూ లవ్‌ ఎమోజీలను పెట్టాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *