
- రేవంత్, వేం సూచనలతో ఫైనల్
- ఏఐసీసీకి చేరిన దస్త్రం
- ఒకటి, రెండు రోజుల్లో నియామకపు ఉత్తర్వులు
- పలువురు ఆశావహులకు నిరాశ
కాంగ్రెస్ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడిగా దొమ్మాటి సాంబయ్య నియామకం ఖరారైనట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఏఐసీసీకి ప్రతిపాదనలు అందినట్లు ప్రచారం సాగుతోంది. డీసీసీ అధ్యక్ష పీఠం తమ వర్గ నాయకుడికి కట్టబెట్టాలని చాలా మంది ఎమ్మెల్యేలు ప్రయత్నాలు చేసినప్పటికీ అధిష్ఠానం దొమ్మాటి వైపే మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. గత పార్లమెంట్ ఎన్నికల్లో వరంగల్ నుంచి పోటీకి దొమ్మాటి సాంబయ్య గ్రౌండ్ సిద్ధం చేసుకున్నారు. అయితే కడియం శ్రీహరి కూతుకు డాక్టర్ కడియం కావ్యకు టికెట్ కేటాయించడంతో నిరాశే మిగిలింది. ఈ నేపథ్యంలో హనుమకొండ జిల్లా అధ్యక్ష పదవిని సాంబయ్యకు కట్టబెడితే తగిన న్యాయం జరుగుతుందని పార్టీ వర్గాలు భావిస్తున్నట్లు సమాచారం. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి తన ప్రధాన అనుచరుడికి అధ్యక్ష పదవి ఇప్పించుకునేందుకు చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టినట్లు తెలిసింది. కొందరు తమ వారసులకు డీసీసీ పీఠం అప్పగించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. అధ్యక్ష పదవికి అరడజను మందికిపైగా ఆశావహులు పోటీ పడినప్పటికీ రాష్ట్ర పార్టీ దొమ్మాి సాంబయ్య పట్ల సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆయన వ్యక్తిగత సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ సూచనలతో అధిష్ఠానం దొమ్మాటి సాంబయ్య పేరును ఖరారు చేసినట్లు తెలుస్తోంది.
-వరంగల్ వాయిస్, హనుమకొండ