
- ఇందిరమ్మ ఇల్లు” పేరుతో అధికారుల చెలగాటం
- దామెర మండలం కోగిల్వాయిలో దారుణం
- ప్రోసిడిండ్ కాపీ వచ్చిందని ఇల్లు నేలమట్టం
- వానాకాలంలో నిరాశ్రయులైన బాధితులు
- న్యాయం చేయాలని వేడుకోలు
వరంగల్ వాయిస్, దామెర : ఒకవైపు వానాకాలం ప్రారంభమై ప్రజలను బెంబేలెత్తిస్తుంటే, మరోవైపు ఇందిరమ్మ ఇల్లు ఆశ చూపి, ఉన్న గూడును కూడా కోల్పోయేలా చేసిన ఒక దురదృష్టకర సంఘటన హనుమకొండ జిల్లా దామెర మండలం కోయిలవాయి గ్రామంలో చోటుచేసుకుంది. పంచాయతీ కార్యదర్శి నిర్లక్ష్యం వల్ల తమ పాత ఇంటిని కూల్చుకుని, ప్రస్తుతం నిరాశ్రయులైన ఒక కుటుంబం న్యాయం కోసం వేడుకుంటోంది.
ఉన్న ఇల్లును కోల్పోయిన కుటుంబం
కోయిలవాయి గ్రామానికి చెందిన పోటు సునీత, రవి దంపతులకు ఇటీవల ఇందిరమ్మ ఇల్లు మంజూరైనట్లు గ్రామ పంచాయతీ కార్యదర్శి సరళ తెలియజేశారు. మంజూరు కాపీని కూడా అందజేసిన కార్యదర్శి, పాత రేకుల ఇల్లును కూల్చి కొత్త ఇంటిని త్వరితగతిన నిర్మించుకోవాలని, లేదంటే మంజూరైన ఇల్లు వెనక్కి వెళ్తుందని ఒత్తిడి చేశారు. కార్యదర్శి మాటలు నమ్మిన సునీత, రవి దంపతులు తమ పాత ఇంటిని కూల్చివేశారు. కొత్త ఇంటి నిర్మాణానికి సన్నాహాలు చేసుకుంటున్న సమయంలో, ఊహించని పరిణామం ఎదురైంది.
మంజూరు కాపీ వెనక్కి తీసుకున్న కార్యదర్శి
తాజాగా, పంచాయతీ కార్యదర్శి తమ పేరు ఇందిరమ్మ ఇళ్ల జాబితాలో లేదని తెగేసి చెబుతున్నారని బాధితురాలు సునీత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు, తమకు ఇచ్చిన మంజూరు కాపీలో పేరు తప్పుగా పడిందని సరిచేయాలంటూ తమ భర్త రవి వద్ద నుంచి ఆ కాపీని కూడా కార్యదర్శి వెనక్కి తీసుకున్నారని సునీత ఆరోపించారు. అధికార పార్టీకి చెందిన గ్రామ నేత జంగిలి వేణు, పంచాయతీ కార్యదర్శి సరళ ఇద్దరూ తమకు ఇందిరమ్మ ఇల్లు వచ్చిందని చెప్పి, ఇప్పుడు లేదని అంటున్నారని బాధితులు వాపోతున్నారు.
వానాకాలంలో మాకు దిక్కేది?
“ప్రస్తుతం వానాకాలం సీజన్ లో కనీస గూడు కూడా లేకుండా పోయాం. ఇందిరమ్మ ఇల్లు వచ్చిందని చెప్పి, ఇప్పుడు రాలేదని అనడం ఎంతవరకు సబబు? మాకున్నదంతా కోల్పోయి, ఇప్పుడు నిరాశ్రయులమయ్యాం,” అని పోటు సునీత కన్నీటిపర్యంతమయ్యారు. తమకు న్యాయం చేసి, ఇందిరమ్మ ఇల్లు ఇప్పించాలని బాధిత కుటుంబ సభ్యులు ఉన్నతాధికారులను వేడుకుంటున్నారు. ఈ విషయంపై అధికారులు తక్షణమే స్పందించి, బాధితులకు న్యాయం చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.
రెండో విడతలో న్యాయం చేస్తాం
– ఎంపీడీవో గుమ్మడి కల్పన
కోయిలవాయి గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు మంజూరైందని చెప్పి, పాత ఇంటిని కూల్చుకున్న తర్వాత మంజూరు రద్దు కావడంతో నిరాశ్రయులైన పోటు సునీత కుటుంబం ఘటనపై ఎంపీడీవో గుమ్మడి కల్పన వివరణ ఇచ్చారు. వరంగల్ వాయిస్ రిపోర్టర్ వివరణ కోరగా, ఈ సంఘటనపై ఎంపీడీవో స్పందించారు. కోయిలవాయి గ్రామంలో రెండు కుటుంబాల భార్యాభర్తల పేర్లు ఒకేలా ఉండడం వల్ల ఈ పొరపాటు జరిగిందని ఎంపీడీవో గుమ్మడి కల్పన తెలిపారు. ఆధార్ కార్డుతో సరిపోల్చి చూసినప్పుడు, మరొక లబ్ధిదారునికి ఇందిరమ్మ ఇంటి మంజూరు పత్రాన్ని ఇచ్చినట్లు గుర్తించామని ఆమె పేర్కొన్నారు. అయితే, పోటు సునీత కుటుంబానికి అన్యాయం జరిగిందని అంగీకరించిన ఎంపీడీవో, ఈ విషయంపై ఉన్నతాధికారులతో మాట్లాడతానని హామీ ఇచ్చారు. రెండవ విడతలో తప్పకుండా ఆ బాధిత కుటుంబానికి ఇందిరమ్మ ఇంటిని మంజూరు చేస్తామని ఆమె స్పష్టం చేశారు. ఈ వివరణతో, నిరాశ్రయులైన కుటుంబానికి భవిష్యత్తులో న్యాయం జరుగుతుందని ఆశలు చిగురించాయి.