Warangalvoice

chahath bajpai – చాలెంజింగ్ ఆఫీసర్.. చాహత్ బాజ్ పాయ్

  • ఆకస్మిక తనిఖీలతో హల్ చల్
  • అక్రమార్కులపై ఉక్కుపాదం
  • పాలనలో పట్టు భిగిస్తున్న ఐఏఎస్
  • గ్రేటర్ కమిషనర్ గా తనదైన ముద్ర
  • మరో శాలినీమిశ్రా అంటూ కితాబు

గ్రేటర్ వరంగల్ కు ఎంతో మంది కమిషనర్లు వస్తుంటారు.. పోతుంటారు. అందులో కొందరు మాత్రమే నగర ప్రజల గుండెల్లో కొలువై ఉంటారు. నగరాభివృద్ధిలో వారి మార్క్ ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. అలాంటి వారిలో ప్రముఖంగా చెప్పుకునే పేరు శాలినీ మిశ్రా అయితే అదే స్థాయిలో అధికారులను పరుగులు పెట్టిస్తూ పాలనను చక్కదిద్దే పనిలో పడ్డారు ప్రస్తుత కమిషనర్ చాహత్ బాజ్ పాయ్. 13 జూన్ 2025న విధుల్లో చేరిన కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ గ్రేటర్ పరిధిలోని అన్ని రంగాలపై పట్టు సాధిస్తున్నారు. క్షేత్ర స్థాయిలో ఆకస్మిక తనిఖీలు చేస్తూ దూకుడు ప్రదర్శిస్తున్నారు. పడకేసిన స్మార్ట్ సిటీ, హృదయ్, అమృత్ పథకాలను గాడిలో పెట్టేందుకు చర్యలు చేపట్టారు. శానిటేషన్ సిబ్బందితో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి వారికి కావాల్సిన గ్లౌజ్ లు, రేయిన్ కోట్ లు ఇతర సదుపాయాలను కల్పించడంతోపాటు ప్రజల ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉందంటూ వారిని కార్యోన్ముఖులను చేశారు. విధుల్లో అలసత్వం ప్రదర్శించే అధికారులు, ఉద్యోగులు, కార్మికులపై కఠిన చర్యలకు ఉపక్రమిస్తున్నారు. రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా ప్రజావసరాలే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. దీంతో నగరానికి మరో శాలినీమిశ్రా కమిషనర్ గా వచ్చిందంటూ స్థానికులు చాహత్ బాజ్ పాయ్ కి కితాబిస్తున్నారు.
-వరంగల్ వాయిస్ ప్రతినిధి

గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్ గా చాహత్ బాజ్ పాయ్ పాలనలో దూకుడు పెంచారు. నిత్యం క్షేత్ర స్థాయి పర్యటనలు చేస్తూ అన్ని విభాగాల అధికారులు, సిబ్బందిని పరుగులు పెట్టిస్తున్నారు. మొక్కవోని సంకల్పంతో ముందుకెళ్తున్నారు. ‘సమస్యల వాణి.. మారాలి పరిష్కార బాణి’ అంటూ ప్రతి సోమవారం గ్రీవెన్స్ కి వచ్చే దరఖాస్తులకు సత్వర పరిష్కారం చూపుతున్నారు. నగర ప్రజలకు మెరుగైన సేవలందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. కరీంనగర్ కమిషనర్ గా పనిచేసిన అనుభవం చాహత్ బాజ్ పాయ్ కి కలిసొస్తుందనే చెప్పవచ్చు. సరిలేరు నీకెవ్వరూ అన్నట్లు పాలనపై పట్టు సాధిస్తున్నారు. దూకుడుగా వ్యవహరిస్తూ పెండింగ్ పనులను గాడిన పెడుతున్నారు. నిత్యం క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ స్థానిక సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేలా చర్యలు చేపడుతున్నారు.

వృధాపై దృష్టి..
బల్దియా పరిధిలో వృధాపై కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ ప్రత్యేక దృష్టి పెట్టారు. కార్పొరేషన్ ఆదాయానికి గండి కొట్టే ప్రతి దస్త్రాన్ని తిప్పి పంపుతున్నారు. చెత్త తరలింపు వాహనాలపై నిగా పెంచారు. ప్రతి ఇంటి నుంచి చెత్త సేకరణ పకడ్బంధీగా జరిగేలా చర్యలు చేపట్టారు. బల్దియాకు చెందిన అన్ని వాహనాలకు ‘జీపీఎస్’ సిస్టమ్ ఏర్పాటు చేయాలంటూ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. బల్దియా ఖజానాకు నష్టం తెస్తున్న కోడి వ్యర్థాల సేకరణ కాంట్రాక్టును బహిరంగ వేలం ద్వారా ఖరారు చేసేందుకు నిర్ణయించారు. పిల్లల పార్క్, పబ్లిక్ గార్డెన్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. రోడ్లు, డ్రైనేజీలతోపాటు అసంపూర్తి పనులపై ప్రత్యేక దృష్టి పెట్టారు.

ప్రజారోగ్యంపై ప్రత్యేక దృష్టి..
ప్రజారోగ్యం, పారిశుధ్యంపై కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ ప్రత్యేక దృష్టి పెట్టారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచేందుకు చర్యలు చేపట్టారు. దీనిపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కృషి చేస్తున్నారు. అమ్మవారిపేటలో నగర వాసుల అవసరాలకు అనుగుణంగా 150 కేఎల్ డీ సామర్థ్యంతో నిర్మిస్తున్న మానవ వ్యర్థాల శుద్ధీకరణ కేంద్రాన్ని సిద్ధం చేశారు. ప్రతి ఇంటి నుంచి తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించే కార్యక్రమాన్ని ముమ్మరం చేశారు.

ప్లాస్టిక్ పై సమరం..
సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పై కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ సీరియస్ గా ఉన్నారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ విక్రయించే దుకాణదారులకు రూ. లక్ష వరకు జరిమానా విధించడంతోపాటు రవాణా చేసేందుకు ఉపయోగించే వాహనాలను, షాపును సీజ్ చేస్తున్నారు. ప్లాస్టిక్ ను ప్రోత్సహించే వారిపై ఉక్కుపాదం మోపుతున్నారు. నగరంలో పచ్చదనం పెంపొందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. పలు కాలనీలో నూతనంగా మురుగు కాలువలు, సీసీ రోడ్లు నిర్మిస్తూ ప్రజలకు మెరుగైన సదుపాయాలను అందిస్తున్నారు. గ్రేటర్ వరంగల్ ప్రధాన కార్యాలయాన్ని పరిశుభ్రంగా ఉంచేలా సిబ్బంది తగు సూచనలు చేశారు. గ్రేటర్ లో పనిచేసే అధికారులు, ఉద్యోగులు, కార్మికులు విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదంటూ హెచ్చరికలు జారీ చేశారు. సమయపాలన పాటించని వారిపై వేటు వేస్తున్నారు.

ప్రజావసరాలే లక్ష్యంగా..
నగరంలో పెండింగ్ లో ఉన్న స్మార్ట్ సిటీ, హృదయ్, అమృత్ తో పాటు ఇతర ప్రభుత్వ పథకాల ద్వారా చేపట్టిన అభివృద్ధి పనులపై కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ దృష్టి సారించారు. రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా ప్రజావసరాలే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. దీంతో కమిషనర్ కు ఏదైనా పని చెప్పాలంటేనే ప్రజాప్రతినిధులు జంకుతున్నారు.

పరుగులు పెట్టిస్తున్నారు..
వరంగల్ మహా నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనులను కమిషనర్ నిత్యం క్షేత్ర స్థాయిలో తనిఖీలు చేస్తూ అధికారులను పనుగులు పెట్టిస్తున్నారు. నగరంలో చేపడుతన్న పనుల్లో నాణ్యతాప్రమాణాలు పాటించాలంటూ ఆదేశిస్తున్నారు. అలా అన్ని సక్రమంగా ఉంటేనే బిల్లులు చెల్లిస్తున్నారు. ఉద్యోగులు, జవాన్లు, ఇతర సిబ్బంది అంకిత భావంతో విధులు నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నారు. పాలనలో దూకుడు పెంచి ప్రజలకు చేరువవుతున్నారు. బల్దియా పరిధిలోని అన్ని విభాగాల్లో పట్టు సాధిస్తున్నారు.

chahath bajpai

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *