
- కన్నుల పండువగా భద్రకాళి అమ్మవారి దర్శనం
- పది టన్నుల కూరగాయలు, ఆకు కూరలతో అలంకరణ
- పులకించిన భక్తజనం
- ఆలయానికి పోటెత్తిన భక్తులు
- కార్యక్రమాలను ప్రారంభించిన మంత్రి సురేఖ
- పూర్ణకుంభ స్వాగతం పలికిన అధికారులు
- 300మంది పోలీసులతో భారీ భద్రతా ఏర్పాట్లు
సాక్షాత్తు శక్తి స్వరూపిణి అయిన భద్రకాళి అమ్మవారి ఆషాడ మాస శాకంబరీ ఉత్సవాలను గురువారం అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు. ఆషాఢ శుద్ధ పాడ్యమి నుంచి పౌర్ణమి వరకు జరిగే శాకంబరీ ఉత్సవాలకు ఎంతో విశిష్టత ఉంది. పదిహేను రోజులపాటు ఉదయం, సాయంత్రం అమ్మవారి ఉత్సవమూర్తులను వివిధ రూపాలలో అలంకరించి పూజలు చేశారు. చివరి రోజైన ఆషాఢ శుద్ధపౌర్ణమి అయిన గురుపౌర్ణమి పర్వదినాన అమ్మవారిని వివిధ రకాల కూరగాయలు, ఆకు కూరలు, పండ్లతో శాకంబరీగా అలంకరించారు. భద్రకాళి ఆలయానికి ఉదయం 10 గంటలకు చేరుకున్న దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖకు ఆలయ అర్చకులు, అధికారులు పూర్ణకుంభ స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మంత్రి సురేఖ జ్యోతి ప్రజ్వలన చేయడంతో భక్తుల దర్శనాలకు అనుమతించారు. వివిధ రకాల కూరగాయలతో అలంకరించిన అమ్మవారిని చూసిన భక్తులు పులకించిపోయారు. ప్రత్యేక అలంకరణలో దర్శనమిస్తున్న అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. ఉదయం నుంచే క్యూలైన్లు భక్తులతో కిక్కిరిసి పోయాయి. ఓరుగల్లు ప్రజలతోపాటు రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన భక్తులు భద్రకాళీ అమ్మవారిని శాకంబరీగా చూసి తరించారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. 300మందితో భారీ బందోబస్తు నిర్వహించారు.
-వరంగల్ వాయిస్ ప్రతినిధి
నగరంలోని సుప్రసిద్ధ శ్రీ భద్రకాళి దేవస్థానంలో గత పదిహేను రోజులుగా జరుగుతున్న రాకాంత దీక్ష పూర్వక శాకంబరీ నవరాత్రులు గురువారంతో ముగిశాయి. చివరి రోజు ఆషాడ శుద్ధ పౌర్ణమి రోజున అమ్మవారిని శాకంబరీగా అలంకరించి పూజారాధనలు జరిపారు. ఉదయం 10 గంటలకు దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఆలయానికి విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం అమ్మవారి దర్శనానికి అనుమతించారు. దీంతో కట్టలు తెంచుకున్న ఆనందంతో గుడిలోకి ప్రవేశించి శాకంబరీ అలంకారంలో ఉన్న అమ్మవారిని దర్శించుకొని పులకించిపోయారు. క్యూలైన్లు అన్నీ భక్తులతో నిండిపోయాయి. వేలాదిమంది భక్తులు శాకంబరీగా ఉన్న అమ్మవారిని దర్శించుకుని తరించిపోయారు. దేవస్థానం ప్రాంగణం అంతా భద్రకాళి శరణం మమ, శాకంబరీ శరణం మమ అనే నామ స్మరణతో మారుమ్రోగింది.
మంత్రికి పూర్ణకుంభ స్వాగతం..
ఆలయానికి విచ్చేసిన మంత్రి కొండా సురేఖకు ఆలయ చైర్మన్ డాక్టర్ బి.శివసుబ్రహ్మణ్యమ్, ధర్మకర్తలు తొనుపునూరి వీరన్న, గాదె శ్రవణ్ కుమార్ రెడ్డి, ఓరుగంటి పూర్ణచందర్, తొగరు బ్రాంతి, బింగి సతీష్, మోతుకూరి మయూరి రామేశ్వర్రావు, గాండ్ల స్రవంతి, నార్ల సుగుణ, వెలడుగు అంజనేయులు, జారతి వెంకటేశ్వర్లు, అనంతుల శ్రీనివాస్ రావు, ఈవో శేషు భారతి, ప్రధానార్చకులు భద్రకాళి శేషు పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికారు.
10 టన్నుల కూరగాయలు..
సుమారు 10 వేల కిలోల కూరగాయలు, ఆకుకూరలు, పండ్లను సేకరించి దండలుగా చేసి అమ్మవారిని సర్వాంగ సుందరంగా అలంకరించారు. తెల్లవారి జామున 3 గంటలకు ప్రారంభమైన అమ్మవారి శాకంబరీ అలంకరణ ఉదయం 9.30 గంటల వరకు సాగింది. ఉదయం 10 గంటలకు ప్రత్యేక పూజానంతరం భక్తులను దర్శనానికి అనుమతించారు. అమ్మవారి అలంకరణకు కావలసిన కూరగాయలు, ఆకుకూరలు, పండ్ల బుధవారం సాయంత్రం నుంచే భక్తులు సుచిగా గుడికి చేరుకొని అర్చకుల సూచనల మేరకు దండలుగా తయారు చేసి ఇచ్చారు.
శాకంబరీ అనగా..
ఈ శాకంబరీ దేవి నీల వర్ణం కలిగి కమలాసనముపై చేతుల్లో వరిమొలకలు, పుష్పములు, ఫలములు, చిగురుటాకులు, దుంపగడ్డలు మొదలగు కూరగాయల సముదాయమును ధరించి ఉండును. ఈ శాక సముదాయములు అంతులేని కోరికలను తీర్చు రసములు గలవై జీవులకు కలుగు అకలి, దప్పిక, మృత్యువు, ముసలితనం మొదలగు వానిని పోగొట్టును. ఉమ, గౌరీ, సతీ, చండీ, కాళికా, పార్వతీ అనే పేర్లతో కూడా ఈ దేవి ప్రసిద్ధి పొందినది. ఈ శాకంబరీ దేవిని భక్తితో ధ్యానం చేయువారు, నమస్కరించువారు, జపించువారు, పూజించువారు తరిగిపోని అన్న, పానామృత ఫలములను అతి శీఘ్రముగా పొందుతారని మూర్తి రహస్యంలో తెలుపబడింది. శాస్త్రాలలో ఈ శాకంబరీ మహాత్యం వివరింపబడి ఉండటం వలన ఈ శాకంబరీ ఆరాధన బహుళ జనాదరణ పొందినది.
శాకంబరీ అంకరణ హనుమకొండ టీచర కాలనీ వాసి ప్రముఖ పవర్ ఇన్ట్సాలేషన్స్ కాంట్రాక్టర్ డాక్టర్ మండువ శేషగిరిరావు-రేణుక దంపతులు, హైదరాబాదు వాస్తవ్యులు ఈమని హరికృష్ణ-స్మిత దంపతులు సౌజన్యంతో జరిగింది. పోలీసు శాఖ, ఎన్సీసీసీ వాలంటర్లు, శ్రీ లక్ష్మీవెంకటేశ్వర, వెంకటేశ్వర సేవా సమితి సభ్యులు భారీగా తరలి వచ్చిన భక్తులకు క్యూలైన్లలో సేవలందించారు. భద్రకాళి సేవాసమితి కన్వీనర్ అయిత గోపీనాథ్ ఆధ్వర్యవంలో వేలాది మంది భక్తులకు ప్రసాద వితరణ జరిపారు. అనంతరం శాకంబరీ నవరాత్రుల పూర్ణాహుతి కార్యక్రమాన్ని కన్నుల పండువగా జరిపించారు.
300 మందితో బందోబస్తు
శ్రీ భద్రకాళి దేవాలయంలో శాకాంబరీ నవరాత్రి మహోత్సవాల నేపథ్యంలో మట్టెవాడ ఇన్ స్పెక్టర్ గోపి ఆధ్వర్యంలో పోలీస్ బందోబస్తు నిర్వహించారు. ఇందుకు గాను 300 మంది పోలీస్ సిబ్బందిని వినియోగించారు. భక్తులతో ఆలయం కిక్కిరిసి పోవడంతో ట్రాఫిక్ ను ఎక్కడికక్కడ మళ్లిస్తూ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టారు.
ఆయురారోగ్యాలతో ఉండాలి..
శాకంబరీ ఉత్సవాల సందర్భంగా నగరంలోని సుప్రసిద్ధ భద్రకాళి అమ్మవారిని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కొండా సురేఖ మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు సుఖ, సంతోషాలు, ఆయురారోగ్యాలతో జీవించాలని కోరుకున్నానని వెల్లడించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధిలో మరింత ముందుకు పోవాలని అమ్మవారిని ప్రార్థించినట్లు కొండా సురేఖ తెలిపారు.