
- భద్రకాళికి పోటెత్తనున్న భక్తులు
- ప్రత్యేక ఏర్పాట్లు చేసిన ఆలయ అధికారులు
వరంగల్ వాయిస్, వరంగల్ : మహానగరంలోని సుప్రసిద్ధ శ్రీ భద్రకాళి దేవాలయంలో 15 రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహించిన శాకంబరీ ఉత్సవాలు ముగింపు దశకు చేరుకున్నారు. శ్రీ భద్రకాళి దేవాలయంలో ఆషాఢ శుద్ధ పౌర్ణమిని పురస్కరించుకొని నిర్వహించనున్న శాకంబరి ఉత్సవాలకు ఆలయ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. గురువారం తెల్లవారు జామున 3 గంటలకు నిత్యాహ్నికం నిర్వహించిన అనంతరం వివిధ రకములైన కూరగాయలతో అమ్మవారికి శాకంభరీ అలంకారము ప్రారంభం కానుంది. అమ్మవారి అలంకారమునకు సుమారు 6 గంటల వ్యవధి పడుతుంది. ఈ సమయంలో అమ్మవారిని దర్శించుకొనేందుకు అవకాశం ఉండదు. అలంకరణను ఉదయం 9 గంటలలోపు పూర్తి చేసేలా పూజారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అలంకరణ పూర్తి అయిన తర్వాత శ్రీ భద్రకాళీ అమ్మవారి శాకంభరీ విశ్వరూప దర్శనం ప్రారంభమై రాత్రి వరకు కొనసాగుతుంది. భక్తుల సౌకర్యార్థం సర్వదర్శనముతో పాటు విశిష్ట దర్శనం, అతిశీఘ్ర దర్శనం, ధర్మదర్శనం క్యూలైన్లు వేర్వేరుగా ఏర్పాటు చేసినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి కె.శేషుభారతి తెలిపారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున తరలి వచ్చే భక్తుల రాకను పురస్కరించుకొని ప్రభుత్వ శాఖల నుంచి భద్రతా, తదితర ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. ఉదయం 11 గంటలకు వ్యాసపూజ, మహాపూర్ణాహుతి, బనిప్రధానం, అవబృథంతో శాకంభరీ ఉత్సవ పరిసమాప్తి జరుగుతుందన్నారు. శాకంబరి ఉత్సవాల సందర్భంగా శ్రీ లక్ష్మీ శ్రీనివాస సేవా సమితి, మహబూబాబాద్ కు చెందిన జీకే రెడ్డి ఆధ్వర్యంలో దేవాలయ కార్యనిర్వహణాధికారి శేషుభారతి, ప్రధానార్చకులు భద్రకాళి శేషు,సేవాసమితి సభ్యులు సుమారు ఎనిమిది క్వింటాళ్ల కూరగాయలను అమ్మవారికి సమర్పించారు.
ముద్ర క్రమంలో అమ్మవారు..
శ్రీ భద్రకాళి దేవస్థానంలో శాకంభరీ నవరాత్ర మహోత్సవములు బుధవారం 14వ రోజుకు చేరుకున్నాయి. తిథిమండల దేవతా యజనంలో భాగంగా కాళీ క్రమాన్ని అనుసరించి అమ్మవారి ఉత్సవ మూర్తులలో ఇచ్చాశక్తిని ‘ముద్రా’ గాను షోడశీ క్రమాన్ని అనుసరించి జ్ఞానశక్తిని ‘జ్వాలామాలినీ’ గాను అలంకరించి పూజారాధనలు జరిపారు. చతుర్దశి తిథికి అధిదేవతయైన అమ్మవారి యొక్క ఒక్క విభూతి భద్రకాళీ అమ్మవారి భక్తులకు సంతోషాన్ని ప్రసాదిస్తుంది. మనిషికి కోరిన కోర్కెలు నెరవేరినపుడు సంతోషం కలుగుతుంది. అంటే ఆ అమ్మవారు భద్రకాళి అమ్మవారి యొక్క భక్తుల కోరిన కోర్కెలను నెరవేర్చి అమితమైన సంతోషాన్ని కలిగిస్తుంది కాబట్టి శాస్త్రములు అట్టి అమ్మవారిని ముద్రా అని కీర్తించాయి.

శ్రీ హనుమద్గిరి పద్మాక్షి దేవస్థానంలో..
కాకతీయ సామ్రాజ్య అధిష్ఠాన దేవి ఓరుగల్లు భక్తుల కొంగుబంగారంగా విరాజిల్లుతున్న శ్రీ హనుమద్గిరి పద్మాక్షి అమ్మవారి ప్రేరణతో భక్తుల సహకారంతో ఆషాఢ పౌర్ణమి (గురు పౌర్ణమి) గురువారం శాకంబరి ఉత్సవాలను కన్నుల పండువగా నిర్వహించనున్నట్లు పద్మాక్షి ఆలయ అనువంశిక వేద పండితులు నాగిళ్ల షణ్ముఖ శర్మ అవధాని తెలిపారు. అమ్మవారిని ఆకుకూరలు, కాయకూరలు, పండ్లతో విశేష శాకంబరిగా అలంకరించనున్నట్లు వెల్లడించారు. ఉదయం 9.30 గంటలనుంచి భక్తులకు అమ్మవారి దర్శనం కల్పించనున్నట్లు ప్రకటించారు. కావున భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవారి కృపకు పాతృతు కావాలని నాగిళ్ల షణ్ముఖ శర్మ కోరారు.