
- సొంత చెల్లిని కూడా ఓర్వలేని అహంకారం నీది
- కేటీఆర్ పై మంత్రి సీతక్క ఫైర్
వరంగల్ వాయిస్, ములుగు : సమ్మక్క-సారక్క వారసులం.. మా జోలికొస్తే నాశనమైపోతావ్ అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ఫైర్ అయ్యారు. సొంత చెల్లెలిని కూడా ఓర్చలేని అహంకారం నీదన్నారు. నిజంగా నీకు ఆడబిడ్డల మీద గౌరవముంటే నా మీద ఈ దాడులు జరిగేవి కావన్నారు. ములుగు జిల్లా కేంద్రంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి సీతక్క కేటీఆర్ పై తీవ్రవ్యాఖ్యలు చేశారు. తాను ఆదివాసి మహిళనని చూడకుండా కావాలని రాజకీయ దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. 70 ఏళ్ల చరిత్రలో తొలిసారి కోయ వర్గానికి మంత్రి పదవి లభించిందని, అదే తనకు ఓ బాధ్యతగా భావించి ములుగు అభివృద్ధికి కృషి చేస్తున్నానని సీతక్క తెలిపారు. నేను ఎలాంటి తప్పు చేసినా, అసెంబ్లీలో చర్చ పెట్టి నిలదీయండన్నారు. అంతేకాని పక్క నియోజకవర్గాల నుంచి ప్రజలను తీసుకొచ్చి రోడ్లమీద ధర్నాలు చేయిస్తే ఇక్కడి ప్రజలు చూస్తూ ఊరుకుంటారా అన్ని ప్రశ్నించారు. ములుగులో ఇప్పుడు ప్రజారాజ్యం నడుస్తోందన్నారు. ఇదే నిజమైన ఇందిరమ్మ పాలన అని ఆమె తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత అభివృద్ధిని ఓర్చలేక తప్పుడు ఆరోపణలు చేస్తున్నదని విమర్శించారు. మీ ప్రభుత్వంలో ఎందరో ఆత్మహత్యలు చేసుకున్నారని, ఇప్పుడు మీరు సీతక్క రాజ్యం, పోలీస్ రాజ్యం అంటూ ప్రచారం చేస్తే ప్రజలు నమ్మరన్నారు. మా పాలనలో ఎవ్వరిపై తప్పుడు కేసులు పెట్టలేదని నిజంగా పెట్టి ఉంటే లెక్కలు చూపించండి అంటూ ఆమె సవాల్ విసిరారు. ఉద్యమ సమయంలో జనాలను రెచ్చగొట్టి చనిపోయేలా చేసి మీరు మాత్రం అధికారం అనుభవించారంటూ దుయ్యబట్టారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ములుగులో కనీసం వేయి ఇండ్లు కట్టించి ఇవ్వలేదన్నారు. ఇక్కడ జరుగుతున్న అభివృద్ధిపై మీకు మాట్లాడే అర్హత ఉందా అంటూ నిలదీశారు. డిజిటల్ మీడియా వేదికల ద్వారా దుబాయ్ లాంటి ప్రాంతాల్లో స్టూడియోల్లో కూర్చుని తప్పుడు కథనాలు తయారు చేస్తున్నారని పేర్కొన్నారు. బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న నీచరాజకీయాలను స్థానిక ప్రజలు గమనిస్తున్నారన్నారు. ఇకనైనా పద్ధతి మార్చుకోవాలని సీతక్క హితవు పలికారు.
వైఎస్ కు నివాళి..
ములుగు జిల్లా కేంద్రంలోని క్యాంప్ కార్యాలయంలో దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్.రాజశేఖర్ రెడ్డి 76వ జయంతి వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భముగా మంత్రి సీతక్క వైఎస్సార్ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాలులు అర్పించారు. మహానేత ఆంధ్ర రాష్ట్రానికి చేసిన సేవలు అమోఘం అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవి చందర్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణితో పాటు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర, జిల్లా, బ్లాక్, మండల, గ్రామ స్థాయి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.