Warangalvoice

SLBC Tunnel | ఎస్ఎల్‌బీసీ టన్నెల్‌లో కొనసాగుతున్న సహాయక చర్యలు

  • నాగర్ కర్నూల్ జిల్లాలోని దోమల పెంట ఎస్ఎల్‌బీసీ టన్నెల్‌లో (SLBC Tunnel) సహాయక చర్యలు 36వ రోజుకు చేరుకున్నాయి. సొరంగంలో చిక్కుకున్న వారిని వెలికితీసేందుకు రెస్క్యూ బృందాలు నిర్విరామంగా కృషిచేస్తున్నాయి. ప్రమాదం జరిగి 36 రోజులు గడుస్తున్నా.. ఇప్పటికీ ఇద్దరు ఇంజనీర్ల మృతదేహాలు మాత్రమే లభించాయి.

వరంగల్ వాయిస్, నాగర్‌కర్నూల్ : నాగర్ కర్నూల్ జిల్లాలోని దోమల పెంట ఎస్ఎల్‌బీసీ టన్నెల్‌లో (SLBC Tunnel) సహాయక చర్యలు 36వ రోజుకు చేరుకున్నాయి. సొరంగంలో చిక్కుకున్న వారిని వెలికితీసేందుకు రెస్క్యూ బృందాలు నిర్విరామంగా కృషిచేస్తున్నాయి. ప్రమాదం జరిగి 36 రోజులు గడుస్తున్నా.. ఇప్పటికీ ఇద్దరు ఇంజనీర్ల మృతదేహాలు మాత్రమే లభించాయి. మిగిలిన ఆరుగురి కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. రోజు మాదిరిగానే శనివారం ఉదయం సైతం ఎస్‌డీఆర్ఎఫ్, ఎన్‌డీఆర్ఎఫ్, సింగరేణి, ఆర్మీ, కేరళ పోలీస్ క్యాడవార్ డాగ్స్ వంటి రిస్క్యూ టీంలు సహాయ చర్యలు చేపట్టేందుకు సొరంగంలోకి వెళ్లాయి. ఇంత శ్రమిస్తున్న శ్రమకు తగిన ఫలితం దక్కడం లేదన్న ఆవేదనతో అధికారులు, రెస్క్యూ బృందాలు, కార్మికులు ఉన్నారు. సొరంగంలోకి ఉబికి వస్తున్న నీటి ఊటను నిలువరిస్తే తప్ప సహాయక చర్యలు ముందుకు సాగవనేది రెస్క్యూ బృందాలు చర్చించుకుంటున్నట్టు తెలుస్తుంది. ప్రత్యేక అధికారి శివశంకర్ ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్ష నిర్వహిస్తూ సలహాలు సూచనలు చేస్తూ అత్యాధునిక పరికరాలతో సహాయక చర్యలు చేపడుతున్నప్పటికీ టన్నెల్లో చిక్కుకున్న కార్మికులను బయటకు తేలేకపోతున్నారు. జీఎస్‌ఐ అధికారుల సూచనలకు అనుగుణంగా ప్రమాద ప్రదేశం నుంచి 30 మీటర్ల వరకు బారికేడింగ్ చేశారు. టెలిటెల్, బాక్స్ క్రీప్ స్ట్రక్చర్ లాంటి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా నిరంతరం పర్యవేక్షణ జరుపుతున్నా మృతదేహాలు బయటకు తీయలేకపోతున్నామనే నిరాశ రెస్క్యూ బృందాలో నెలకొంటుంది.

ప్రమాద ప్రదేశం సమీపంలో మట్టి కింద ఉన్న లోకో ట్రైన్ క్యాబిన్లను తొలగించి లోకో ఇంజిన్‌ను బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. శనివారం ఆ పనులు పూర్తయే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సొరంగంలో చిక్కుకున్న లోకో ట్రైన్ విడిభాగాలను కటింగ్ చేసి బయటకు తరలిస్తున్నారు. పూర్తిస్థాయిలో ట్రైన్ ను మొత్తాన్ని బయటకు తీస్తే రెస్క్యూ బృందాలకు మృతదేహాలను తీసేందుకు మార్గం సులువుగా ఉంటుందని తెలుస్తోంది. ఈరోజు మొత్తం పూర్తిస్థాయిలో అవే పనులు జరుగుతున్నట్లు సమాచారం. కాగా, పలానా చోట డెడ్ బాడీ ఉంది అని తెలిసినా బయటకు తీయలేకపోతున్నామనే నిరాశతో రెస్క్యూ బృందాలు ఉన్నాయి.

Rescue Operation Reaches 36th Day In Slbc Tunnel
Rescue Operation Reaches 36th Day In Slbc Tunnel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *