
- KTR | డీ లిమిటేషన్‌పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ప్రజాస్వామ్యం మందబలం ఆధారంగా నడవరాదు అని పేర్కొన్నారు.
వరంగల్ వాయిస్, చెన్నై : డీ లిమిటేషన్‌పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ప్రజాస్వామ్యం మందబలం ఆధారంగా నడవరాదు అని పేర్కొన్నారు. చెన్నైలో జరిగిన దక్షిణ భారతదేశ రాష్ట్రాల పార్టీల సమావేశానికి కేటీఆర్ హాజరై మాట్లాడారు.
కేసీఆర్ ఆధ్వర్యంలో 14 ఏండ్ల పాటు తెలంగాణ ఉద్యమం నడిపించారు. 14 సంవత్సరాల అనంతరం తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చుకున్నాం. తమిళనాడు ప్రజల నుంచి అనేక అంశాలు స్ఫూర్తి తీసుకుంటాం. అస్తిత్వం, హక్కుల కోసం కొట్లాడడంలో తమిళనాడు స్ఫూర్తినిచ్చింది. ద్రవిడ ఉద్యమం సమైక్య దేశంలో తమ హక్కులు సాధించడానికి రాష్ట్రాలకు ఒక దిక్సూచీ లెక్క పని చేస్తుందన్నారు కేటీఆర్.
డీ లిమిటేషన్ వల్ల అనేక నష్టాలు. కేంద్ర ప్రభుత్వ వివక్షపూరిత విధానాలతో దక్షిణాది రాష్ట్రాలకు అనేక నష్టాలు. దేశ అభివృద్ధి కోసం పని చేసినందు వల్ల ఇవాళ నష్టం జరుగుతుంది. మనమంతా ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నాం. ప్రజాస్వామ్యం మందబలం ఆధారంగా నడవరాదు అని పేర్కొన్నారు.
దేశానికి 36 శాతం జీడీపీలో భాగస్వామ్యం ఉన్న దక్షిణాది రాష్ట్రాలు నష్టపోతున్నాయి. డీలిమిటేషన్ కేవలం పార్లమెంట్ ప్రాతినిధ్యం తగ్గడమే కాదు.. ఆర్థికపరమైన నిధుల కేటాయింపుల్లో తీవ్రమైన నష్టం జరిగే ప్రమాదం ఉంది. మొదటి నుంచి దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రం వివక్ష చూపుతోంది. ఎన్డీఏ పాలనలో దక్షిణాది రాష్ట్రాలపై వివక్ష మరింత పెరిగింది. వివక్షను కొనసాగించేందుకు డీలిమిటేషన్ అంశాన్ని ముందుకు తీసుకొస్తుంది. బుల్లెట్ రైలు వంటి ప్రాజెక్టులను ఉత్తరాదికే పరిమితం చేయడం ఒక ఉదాహరణ. జనాభా దామాషా ప్రకారం డీలిమిటేషన్ జరిగితేనే దేశ సమాఖ్య స్ఫూర్తికే విఘాతం కలుగుతుంది అని కేటీఆర్ పేర్కొన్నారు.
