
- Bandi Sanjay Clarifies: తెలంగాణ బీజేపీ నూతన అధ్యక్షుడి ఎంపికపై కేంద్రమంత్రి బండి సంజయ్ క్లారిటీ ఇచ్చేశారు. గత కొద్ది రోజులుగా జరుగుతున్న ప్రచారానికి చెక్ పెట్టేశారు కేంద్రమంత్రి.
వరంగల్ వాయిస్, హైదరాబాద్ : తెలంగాణ బీజేపీ నూతన అధ్యక్షుడి ఎంపిక త్వరలోనే జరుగనుంది. ఈ పదవి కోసం పార్టీలోని ఆశావాహులు ఎదురుచూస్తున్న పరిస్థితి. ఆ పదవి తమకే రావాలని పలువురు సీనియర్ నేతలు కోరుకుంటున్నారు. ఇదిలా ఉండగా… తెలంగాణ రాష్ట్ర నూతన బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్ అంటూ గత కొద్దిరోజులుగా ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ క్రమంలో బీజేపీ అధ్యక్షుడి పదవిపై వస్తున్న వార్తలకు కేంద్రమంత్రి పుల్‌స్టాప్ పెట్టేశారు. ‘నేను రాష్ట్ర అధ్యక్ష రేసులో లేను, నాకే రావాలని కోరుకోవడం లేదు’ అని తేల్చి చెప్పేశారు. అలాగే సోషల్ మీడియా, మీడియాలో వచ్చే పేర్లపై, ప్రచారం చేసుకునే నేతలపై అధిష్టానం సీరియస్‌గా ఉందని కేంద్రమంత్రి వెల్లడించారు.
బండి సంజయ్ ఇంకా మాట్లాడుతూ.. డీలిమిటేషన్‌పై చెన్నైలో తమిళనాడు సీఎం స్టాలిన్ అధ్యక్షతన జరుగుతున్న దక్షిణాది రాష్ట్రాల సమావేశంపై స్పందించారు. స్టాలిన్ మీటింగ్‌లో ఉన్నది అందరూ దొంగలే అంటూ కామెంట్స్ చేశారు. లిక్కర్ స్కామ్, ల్యాండ్ స్కామ్ ముఠాలు మీటింగ్ పెట్టుకున్నాయని దుయ్యబట్టారు. మీటింగ్‌లో పాల్గొన్న పార్టీలకు అవినీతి చరిత్ర ఉందన్నారు. కేసీఆర్ కుటుంబానికి నోటిస్ ఎందుకు ఇవ్వవు రేవంత్ అని ప్రశ్నించారు. డీలిమిటేషన్ ప్రక్రియ ప్రారంభమే కాలేదని తెలిపారు. తమిళనాడులో డీఎంకే వెయ్యి కోట్ల లిక్కర్ స్కామ్ చేసిందని ఆరోపించారు. కేసీఆర్ పాలనలో రైతులకు పంట నష్ట పరిహారం ఇవ్వలేదని మండిపడ్డారు. కాంగ్రెస్ ఏర్పడి 15 నెలలు అయినా రైతులను పట్టించుకోవడం లేదని కేంద్రమంత్రి బండి సంజయ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
