Warangalvoice

23న ‘లోకల్’ కోడ్!

  • స్థానిక ఎన్నికలకు ఏర్పాట్లు చేసుకోండి
  • కలెక్టర్లకు ఎన్నికల సంఘం ఆదేశాలు
  • సర్పంచ్, ఎంపీటీసీ ఎన్నికలపై కీలక అప్డేట్
  • పోలింగ్ సిబ్బంది వివరాలు మరోసారి పరిశీలించాలంటూ ఆదేశం
  • గ్రామాల్లో మొదలైన సందడి
  • పెరిగిన ఎంపీపీ, జడ్పీటీసీ స్థానాలు

హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సర్పంచ్, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణకు పూర్తి స్థాయిలో సన్నద్ధమవుతోంది. ఈ మేరకు తాజాగా జిల్లా కలెక్టర్లకు రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేసుకోవాలంటూ సూచించింది. పోలింగ్ సిబ్బంది వివరాలను మరోసారి పరిశీలించాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించింది. దీంతో ఈనెల 23న స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ రానున్నట్లు ప్రచారం సాగుతోంది. మొదట ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు అధికారులకు అవసరమైన సూచనలు కూడా చేసింది. ఎంపీటీసీ ఎన్నికల తర్వాతే సర్పంచ్ ఎన్నికలు నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నారు. అయితే స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో బీసీ రిజర్వేషన్లు కీలక అంశంగా మారాయి. తెలంగాణ కేబినెట్ ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ చేసిన ఆర్డినెన్స్ ప్రస్తుతం గవర్నర్ వద్ద పెండింగ్ లో ఉంది. 2018 పంచాయతీరాజ్‌ చట్టం రాష్ట్ర పరిధిలోనిదే కావడంతో గవర్నర్‌ దగ్గర ఆలస్యం జరగదని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. గవర్నర్‌ ఆమోదంతో ఆర్డినెన్స్‌ రాగానే రిజర్వేషన్ల అమలుకు ప్రభుత్వం ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేయనుంది.
-వరంగల్ వాయిస్ ప్రతినిధి

వరంగల్ వాయిస్ ప్రతినిధి : రాష్ట్రంలో సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల సందడి మొదలైంది. గత సంవత్సర కాలంగా గ్రామాల్లో సర్పంచులు లేకపోవడంతో, ప్రత్యేక అధికారుల ఆధ్వర్యంలో గ్రామాల పాలన కొనసాగుతోంది. హైకోర్టు ఆదేశాలతో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో కదలిక వచ్చింది. అయితే స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో బీసీ రిజర్వేషన్లు కీలక అంశంగా మారింది. తెలంగాణ కేబినెట్ ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించడానికి ఆమోదం తెలిపింది. ఈ మేరకు రూపొందించిన ఆర్డినెన్స్ ను గవర్నర్ కు పంపించింది. ఈ ఆర్డినెన్స్ ద్వారా ఎటువంటి న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా చూస్తోంది. అందులో భాగంగా చట్టంలోని సెక్షన్‌ 285 (ఏ)లోని 50 శాతం సీలింగ్‌ అనే పదాన్ని తొలగించడంతోపాటు, ఇతర సెక్షన్లలోనూ పలు సవరణలు చేయనుంది. ఈ విషయాన్నే పేర్కొంటూ గవర్నర్‌కు ఫైలును పంపింది. అలాగే రాష్ట్రంలో రిజర్వేషన్లను పెంచాల్సిన ఆవశ్యకతతో పాటు.. కులగణన వివరాలను కూడా గవర్నర్‌కు రాష్ట్ర ప్రభుత్వం సమర్పించినట్టు తెలిసింది. 2018 పంచాయతీరాజ్‌ చట్టం రాష్ట్ర పరిధిలోనిదే కావడంతో గవర్నర్‌ దగ్గర ఆలస్యం జరగదని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి.

ఉత్సాహంలో అధికార పార్టీ..
స్థానిక ఎన్నికల సమరంపై కాంగ్రెస్‌లో ఉత్సాహం నెలకొంది. బీసీ రిజర్వేషన్లు తమను గట్టెక్కిస్తాయని భావిస్తున్నారు. గ్రామస్థాయిలో బీసీ నేతలంతా ఇప్పుడు కాంగ్రెస్‌ జెండా పట్టుకుని ఊరేగుతున్నారు. అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికల్లో గెలిచిన ఉత్సాహంతో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ కేడర్‌ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా తమ సత్తా చాటేందుకు సమాయత్తం అవుతున్నారు. బీసీలకు రిజర్వేషన్లతో పాటు రైతులకు రుణమాఫీ, రైతుభరోసా వంటి కార్యక్రమాలను కూడా కాంగ్రెస్‌ ఇప్పటికే ప్రచారం చేసుకుంటోంది. కేడర్‌ కూడా ఉత్సాహంగా ముందుకు సాగుతోంది.

బెడిసి కొట్టిన కవిత ప్లాన్..
బీసీ రిజర్వేసన్లు, స్థానిక ఎన్నికల చుట్టూ ఇప్పుడు తెలంగాణ రాజకీయం కేంద్రీకృతమైంది. ఈ వ్యవహారంలో అధికార కాంగ్రెస్‌ రెండాకులు ఎక్కువే చదివింది. రాజకీయాలను తనకు అనుకూలంగా మార్చుకుని కులగణన చేపట్టడంతోపాటు బీసీ రిజర్వేషన్లకు ఆర్డినెన్స్‌ ప్రతిపాదించింది. బీసీల ఉద్యమాన్ని నెత్తికెత్తుకునే క్రమంలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత చేసిన ప్రయత్నాలు బెడిసి కొట్టాయి. పదేళ్లు అధికారంలో ఉండగా ఏనాడు బీసీల గురించి మాట్లాడని బీఆర్‌ఎస్‌ నేతలు గద్దె దిగగానే బీసీ నినాదం ఎత్తుకోవడం కేవలం రాజకీయ ఎత్తుగడగానే ప్రజలు భావిస్తున్నారు. మొత్తంగా ఇప్పుడు బీసీ రిజర్వేషన్ల పేటెంట్‌ కాంగ్రెస్ దక్కించుకుంది. దీనినే ప్రధాన ఎజెండాగా చేసుకుని అడుగులు వేస్తోంది. విపక్ష పార్టీలకు సవాళ్లు విసురుతోంది.

కోర్టు ఆదేశం..
కాగా, తెలంగాణ హైకోర్టు కూడా ఇటీవల గ్రామ పంచాయతీ ఎన్నికలను మూడు నెలల్లోపు నిర్వహించాలని ఆదేశించింది. బీసీ రిజర్వేషన్ల ప్రక్రియను 30 రోజుల్లో పూర్తి చేసి, ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘానికి సహకరించాలని ప్రభుత్వానికి స్పష్టం చేసింది. ప్రభుత్వం సమ్మతి తెలిపిన తర్వాత 60 రోజుల్లోపు సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలు పూర్తి చేసి, ఫలితాలు ప్రకటించాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది.

కలెక్టర్లకు ఆదేశం..
కోర్టు ఆదేశాల నేపథ్యంలో ఎన్నికల సంఘం తమ కసరత్తును ముమ్మరం చేసింది. పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన పోలింగ్ సిబ్బంది డేటాను సిద్ధం చేయాలని అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించింది. ఫిబ్రవరి నెలలో నమోదైన రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్, ప్రిసైడింగ్ అధికారులు, ఇతర సిబ్బంది వివరాలను మరోసారి క్షుణ్ణంగా పరిశీలించాలని ఈసీ సూచించింది. అలాగే, రాష్ట్రంలోని జిల్లా, రెవెన్యూ, డివిజన్, మండలం, పంచాయతీలతో పాటు వార్డుల సంఖ్య ఆధారంగా పూర్తి వివరాలు అందుబాటులో ఉంచాలని కలెక్టర్లను ఎన్నికల సంఘం ఆదేశించింది. ఈ తాజా ఆదేశాలతో త్వరలోనే పంచాయతీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం తొలుత ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు అధికారులకు అవసరమైన సూచనలు కూడా చేసింది. ఎంపీటీసీ ఎన్నికల తర్వాతే సర్పంచ్ ఎన్నికలు ఉంటాయన్న ప్రచారం సాగుతోంది.

స్థానాల్లో మార్పులు..
రాష్ట్ర వ్యాప్తంగా 71 గ్రామ పంచాయతీలు జీహెచ్ఎంసీ, జీడబ్ల్యూఎంసీ, కార్పొరేషన్లు, మున్సిపాలిటీలలో కలవడంతో భారీగా మార్పులు జరుగనున్నాయి. 2019 ఎన్నికల్లో 5,817 ఎంపీటీసీలు ఉండగా ప్రస్తుతం వాటి సంఖ్య 5,773 కు తగ్గింది. గతంకంటే 44 ఎంసీటీసీ స్థానాలు తగ్గాయి. అదే విధంగా ఎంపీపీ, జడ్పీటీసీ స్థానాలు గతంలో 539 ఉండగా ప్రస్తుతం వాటి సంఖ్య 566కు పెరిగింది. గతంలో గ్రామ పంచాయతీలు 12,769 ఉండగా వాటి సంఖ్య 12,777కు పెరిగింది. అయితే వార్డు సంఖ్య మాత్రం గతంలో 1,13,136 ఉంటే ప్రస్తుతం 1,12,700 ఉన్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *