Warangalvoice

హనుమకొండలో ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి  వేడుకలు

ఉత్తర తెలంగాణ కేంద్రంగా గొల్లకురుమల సాంస్కృతిక సమ్మేళనం

ముఖ్య అతిథిగా హాజరైన హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ..


వరంగల్ వాయిస్, హనుమకొండ :జానపద కళాకారుల ప్రదర్శనతో శ్రీకృష్ణుని శోభాయాత్ర
ఉద్యమాల పురిటి గడ్డ ఓరుగల్లులో ‘యాదవ వెల్ఫేర్ ట్రస్ట్-వరంగల్’ వేదికగా కుడా మాజీ చైర్మన్ ఎస్. సుందర్ రాజ్ ఆధ్వర్యంలో శనివారం శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. హనుమకొండ జిల్లా కేంద్రంలో ఉత్తర తెలంగాణ వేదికగా గొల్లకురుమల ఐక్యతను చాటేలా ఈ గొల్లకురుమ సాంస్కృతికం సమ్మేళనాన్ని భారీ ఎత్తున నిర్వహించారు. జానపద కళాకారుల ప్రదర్శన, మహిళల బోనాలతో హనుమకొండలోని గోకుల్ నగర్ నుండి అంబేద్కర్ సెంటర్ మీదుగా కాళోజీ కళాక్షేత్రం వరకు వేలమందితో శ్రీ కృష్ణుడి శోభాయాత్రను ఘనంగా నిర్వహించారు.రెండువేల మంది గొల్ల కురుమల యువత ఈ శోభాయాత్రలో పాల్గొన్నారు. అనంతరం కాళోజీ కళాక్షేత్రంలో నిర్వహించిన ఈ వేడుకలకు హర్యానా మాజీ గవర్నర్, మాజీ కేంద్ర మంత్రి దత్తాత్రేయ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కళాకారులు వేడుకల్లో గొల్లకురుమ సంస్కృతి సంప్రదాయాలను కళ్లకు కట్టేలా ప్రదర్శనలు ఇచ్చారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని జనగాం, మహబూబాబాద్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్, హనుమకొండ జిల్లాలకు చెందిన గొల్లకురుమలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రాజకీయాలకు అతీతంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో కుల, మత, వర్గాలకు అతీతంగా ప్రజలు ఈ శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో భాగస్వాములు అయ్యారు.
ఈ సందర్భంగా యాదవ వెల్ఫేర్ ట్రస్ట్ అధ్యక్షుడు సుందర్ రాజ్ యాదవ్ మాట్లాడుతూ తెలంగాణలో మూడో సారి శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను పెద్ద ఎత్తున నిర్వహించామని తెలిపారు. కురుక్షేత్ర యుద్ధాన్ని నడిపి ధర్మ పరిరక్షణకు రక్షణ కవచంగా నిలిచి భగవత్ బంధువుడిగా నిలిచిన శ్రీక్రుష్ణుడు గొల్లకురుమల రక్త బాంధవుడని, ఆ పరమాత్ముడి డీఎన్ఏ, మా డీఎన్ఏ ఒక్కటే నని సుందర్ రాజ్ యాదవ్ అన్నారు. దేశంలోనే అతి విశిష్టమైన అనంత పద్మనాభ స్వామి దేవాలయ నిర్మాణ ఘనత యాదవులదయితే, కలియుగ క్షేత్రం తిరుమల తిరుపతిలో తొలి దర్శనం యాదవులదే కావడం, గొల్కొండ కేంద్రంగా రాజ్యపాలన చేయడం ఈ జాతి విశిష్టతకు అద్దం పడుతోందని అన్నారు. సమాజ గమనంలో గొల్లకురుమల ఐక్యత అత్యవసరమైందని,  గొల్లకురుమల సాంస్క్రుతిక వైభవాన్ని మేళవించి భావి సమాజ నిర్మాణానికి పునాది వేయాల్సిన పరిస్థితి ఆవశ్యమైందని సుందర్ రాజ్ యాదవ్ అన్నారు. ఈ కార్యక్రమంలో శాసన మండలి వైస్ చైర్మన్ డాక్టర్ బండా ప్రకాష్, మాజీ ఎమ్మెల్యేలు దాస్యం విజయభాస్కర్,ఎం. ధర్మారావు,వన్నాల శ్రీరాములు, కొండేటి శ్రీధర్,గొర్రెల, మేకల పెంపకందారుల ఫెడరేషన్ మాజీ చైర్మన్ కన్నెబోయిన రాజయ్య యాదవ్, మాజీ జెడ్పీ చైర్మన్ సాంబారి సమ్మారావు, బీజేపీ నాయకులు రావు పద్మారెడ్డి, గంటా రవికుమార్, అఖిల భారత యాదవ మహాసభ ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు గిరబోయిన రాజయ్య యాదవ్, యాదవ వెల్ఫేర్ ట్రస్ట్ సభ్యుడు కెంచ కుమారస్వామి, కార్పొరేటర్ లు జక్కుల రవీందర్ యాదవ్,బొంగు అశోక్ యాదవ్, సినీ, టీవి కళాకారులు కోమలి, మల్లిక్ తేజ, యశోద, నక్క శ్రీకాంత్, అనిత,లావణ్య,మౌనిక,యాదవ మహాసభ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *