
- ఉదయం నోటిఫికేషన్.. మధ్యాహ్నం స్టే
- బీసీ రిజర్వేషన్ల జీవో 9పై వాదోపవాదనలు
- నిలుపుదల చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు
- నాలుగు వారాల్లో కౌంటర్ ధాఖలు చేయాలంటూ ప్రభుత్వానికి ఆదేశం
వరంగల్ వాయిస్ ప్రతినిధి : హైకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 9తో పాటు లోకల్ బాడీ ఎన్నికలను నిలిపివేస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలపై స్టే విధించింది. బీసీ రిజర్వేషన్లపై రెండు రోజులపాటు సుదీర్ఘ వాదనలు విన్న న్యాయస్థానం ఎట్టకేలకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. నాలుగు వారాల్లో కౌంటర్ ధాఖలు చేయాలంటూ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అదే విధంగా పిటిషనర్లకు రెండు వారాల సమయం ఇచ్చింది. బీసీ రిజర్వేషన్లపై తదుపరి విచారణను ఆరు వారాలకు వాయిదా వేసింది.
ఉదయం నోటిఫికేషన్..
రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేయడంతో నామినేషన్ల పర్వం మొదలైంది. రెండు విడతల్లో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించేందుకు సన్నాహాలు చేశారు. నామినేషన్ల ప్రక్రియ గురువారం ఉదయం ప్రారంభం కావడంతో కొందరు ఆశావహులు నామినేషన్ల కూడా దాఖలు చేశారు. బీసీ రిజర్వేషన్లపై హైకోర్టులో మధ్యాహ్నం వాదనలు ప్రారంభమయ్యాయి. ఎవరికి వారు వారి వాదనలు వినిపించారు. రెండు రోజుల పాటు జరిగిన వాదనలను పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం బీసీ రిజర్వేషన్ల జీవో 9పై స్టే విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఎన్నికల ప్రక్రియ నిలిచిపోయింది. ఆ తర్వాత న్యాయస్థానం తీసుకోబోయే నిర్ణయంపై స్థానిక సంస్థల ఎన్నికల భవతవ్యం ఆదారపడి ఉంది. హైకోర్టు స్టేతో సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు బ్రేక్ పడింది.
బీసీల్లో నిరాశ..
స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 9 పై హైకోర్టు స్టే విధించడంతో బీసీ వర్గాలు తీవ్ర నిరాశకు గురయ్యాయి. బీసీల తరుపున రెండు రోజుల పాటు సమర్థవంతంగా వాదనలు వినిపించినప్పటికీ కోర్టు స్టే ఇవ్వడంపై బీసీ వర్గాలు అసహనం వ్యక్తం చేశాయి. హైకోర్టు గేటు ఎదుట బీసీ సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. బీసీలకు న్యాయం కావాలంటూ నినదించారు. దీంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. న్యాయస్థానం నిర్ణయం బాద కలిగించిందని రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ తదితరులు తర్వాత చేపట్టాల్సిన చర్యలపై న్యాయ నిపుణులతో చర్చించారు.