
ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు
వరంగల్ వాయిస్, దామెర : అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం దామెర మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ముందస్తు వేడుకలను అత్యంత ఉత్సాహంగా నిర్వహించారు. విధుల్లో అంకితభావంతో పనిచేస్తున్న మహిళా అధికారులను, సిబ్బందిని ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు, తోటి సిబ్బంది ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో భాగంగా ఎంపీడీఓ గుమ్మడి కల్పన, సూపరింటెండెంట్ సబ్జా రాణి, వారితో పాటు పంచాయతీ కార్యదర్శులు కవిత, సుకన్య, సిరివెన్నెల, ఏపీఓ శారద, జూనియర్ అసిస్టెంట్ జాస్విన్ కంప్యూటర్ ఆపరేటర్ సుమలు కలిసి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ కల్పన మాట్లాడుతూ.. నేడు ప్రతి రంగంలోనూ మహిళలు తమదైన ముద్ర వేస్తున్నారని, ముఖ్యంగా ప్రభుత్వ పాలనలో మహిళా అధికారుల పాత్ర ఎంతో కీలకమని ప్రశంసించారు. సమాజ ప్రగతిలో మహిళలకు సమాన గౌరవం దక్కాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ సిబ్బంది, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.