
వరంగల్ వాయిస్, వరంగల్ : తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల్లో వైద్య విద్య, ఆరోగ్య సదుపాయాలను మెరుగుపరచడానికి కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు కేటాయించాలంటూ శుక్రవారం పార్లమెంట్ లో వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య కోరారు. ప్రధానంగా గ్రామీణ మెడికల్ కళాశాలల్లో డాక్టర్లు, సిబ్బంది, అధ్యాపకుల నియామకాలు, ల్యాబ్స్, లైబ్రరీలు, హాస్టళ్లు, వైద్య పరికరాలు, డయాగ్నస్టిక్ టూల్స్ గ్రామీణ సేవలకు ప్రోత్సాహకాలు వంటి అంశాలపై వరంగల్ ఎంపీ వివరణ కోరారు. గ్రామీణ మెడికల్ కళాశాలల్లో సదుపాయాలను కల్పించడంతోపాటు సిబ్బంది కొరత లేకుండా చూడాలని ఎంపీ కోరారు. మెడికల్ కళాశాలలకు మరిన్ని ప్రత్యేక నిధులు కేటాయించాలని ఎంపీ డాక్టర్ కడియం కావ్య విజ్ఞప్తి చేశారు. ఎంపీ కావ్య అడిగిన ప్రశ్నలకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి అనుప్రియా పటేల్ సమాధానం ఇచ్చారు. కొత్త మెడికల్ కళాశాలల్లో అవసరమైన మౌలిక సదుపాయాలు 2023 నిబంధనల ప్రకారం తప్పనిసరి చేస్తూ అధ్యాపకుల హాజరు ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ సిస్టమ్ ద్వారా పర్యవేక్షిస్తున్నట్లు వెల్లడించారు. 2024–25లో ఎన్‌హెచ్‌ఎం కింద తెలంగాణకు రూ.67.16 కోట్లు, ప్రధాన్ మంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ కింద రూ.208.82 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. దూర ప్రాంతాల్లో పనిచేసే డాక్టర్లకు ప్రత్యేక భత్యాలు, నిపుణులకు గౌరవ వేతనాలు ఇస్తున్నామని పేర్కొన్నారు. అలాగే, కేంద్ర పథకం కింద తెలంగాణలోని తొమ్మిది మెడికల్ కళాశాలలకు 511 పీజీ సీట్లు మంజూరయ్యాయని తెలిపారు. వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజ్‌కు 92 సీట్లు కు గాను మొదటి దశలో 89 సీట్లకు రూ.7.47 కోట్లు విడుదల చేయగా, రెండో దశలో మూడు సీట్లకు రూ.2.15 కోట్లు విడుదల చేసినట్లు తెలియజేశారు.