
- వివరాలు వెల్లడించిన ఏసీపీ ప్రశాంత్ రెడ్డి
వరంగల్ వాయిస్, హసన్ పర్తి : యువ వైద్యురాలు అల్లాడి ప్రత్యూష ఆత్మ హత్యకు కారకులైన నలుగురిని హసన్ పర్తి పోలీసులు అరెస్ట్ చేశారు. హనుమకొండ జిల్లా హసన్ పర్తి మండల కేంద్రంలోని కాకతీయ వెంటేజ్ లోని స్వగృహంలోనే వైద్యురాలు ఆత్మహత్య చేసుకున్న సంఘటన జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ సందర్భంగా హసన్ పర్తి పోలీస్ స్టేషన్ లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో కాజీపేట ఏసీపీ పింగిలి ప్రశాంత్ రెడ్డి వివరాలు వెల్లడించారు. డాక్టర్ ప్రత్యూష మృతికి కారకులైన భర్త డాక్టర్ అల్లాడి సృజన్, అతని తల్లితండ్రులు అల్లాడి మధుసూదన్, అల్లాడి పుణ్యవతితోపాటు బానోతు శృతి కారులో హనుమకొండ-కరీంనగర్ ప్రధాన రహదారిలో వెళ్లుండగా కాకతీయ వెంటేజ్ క్రాస్ సమీపంలో హసన్ పర్తి పోలీసులు వాహనాల తనిఖీ చేస్తుండగా అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. మాటలతో ప్రేరేపించి డాక్టర్ ప్రత్యూష మరణానికి కారకులైన ఈ నలుగురిని కోర్టులో హాజరుస్తున్నట్లు ఏసీపీ ప్రశాంత్ రెడ్డి తెలిపారు. ఈ సమావేశంలో సీఐ చేరాలు, ఎస్సైలు దేవేందర్, రవి, క్రైమ్ కానిస్టేబుల్స్ క్రాంతి, వివేక్ పాల్గొన్నారు. అయితే అల్లాడి ప్రత్యూష ఆత్మహత్యకు ప్రేరేపించిన నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నప్పటికీ వారిని విలేఖరుల ముందు హాజరు పర్చకపోవడం అనుమానాలకు తావిస్తోంది.
ప్రత్యూష కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే నాగరాజు
ఆత్మహత్య చేసుకున్న డాక్టర్ ప్రత్యూష కుటుంబాన్ని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, వరంగల్ అర్బన్ యూత్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కేఆర్.దిలీప్ రాజ్ పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. మంగళవారం వారి నివాసానికి వెళ్లి ప్రత్యూష చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. డాక్టర్ ప్రత్యూష ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలను వారి కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. చట్టరీత్యా అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చి మనోధైర్యం కల్పించారు.