
వరంగల్ వాయిస్, వరంగల్ : రాజ్యసభకు ఎంపికైన ప్రముఖ రాజకీయ నేత వేం నరేందర్ రెడ్డిని వరంగల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు బొమ్మినేని రవీందర్ రెడ్డి సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్లోని వేం నివాసానికి వెళ్లిన ఆయన, నరేందర్ రెడ్డికి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా బొమ్మినేని రవీందర్ రెడ్డి మాట్లాడుతూ.. సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన వేం నరేందర్ రెడ్డి మార్గదర్శకత్వం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ఎంతో అవసరమని పేర్కొన్నారు. ఆయన రాజ్యసభకు ఎన్నిక కావడం పట్ల వరంగల్ వ్యాపార వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయని తెలిపారు. ప్రస్తుతం వ్యాపార, వాణిజ్య రంగాలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను ఈ సందర్భంగా బొమ్మినేని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. పార్లమెంటు ఎగువ సభ (రాజ్యసభ) వేదికగా ఈ సమస్యలపై గళమెత్తి, వాటి పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం నుంచి సానుకూల నిర్ణయాలు వచ్చేలా కృషి చేయాలని వేం నరేందర్ రెడ్డిని కోరారు. దీనిపై స్పందించిన నరేందర్ రెడ్డి, తన వంతు పూర్తి సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు.