
వృద్ధుడి ప్రాణం కాపాడేందుకు ఎస్సై తాపత్రయం
ఎస్సై సీపీఆర్ చేసినా దక్కని ప్రాణం
వరంగల్ వాయిస్, దామెర : ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఒక వ్యక్తిని కాపాడేందుకు ఓ పోలీస్ అధికారి తన వంతు ప్రయత్నం చేశారు. నిమిషాల వ్యవధిలో స్పందించి ప్రాణవాయువు అందించే ప్రయత్నం చేసినా, విధి వెక్కిరించడంతో ఆ వ్యక్తి మృతి చెందారు. శుక్రవారం దామెర మండల కేంద్రంలో జరిగిన ఈ ఘటన స్థానికులను కలచివేసింది. దామెర గ్రామానికి చెందిన భాషబోయిన రాజాలు (58) శుక్రవారం పోలీస్ స్టేషన్ సమీపంలోని వాటర్ ట్యాంకు వద్ద పక్కనే ఉన్న వారితో మాట్లాడుతుండగా, ఒక్కసారిగా గుండెపోటుతో కింద పడిపోయారు. ఇది గమనించిన స్థానికులు వెంటనే అక్కడ విధుల్లో ఉన్న ఎస్సై కొంక అశోక్కు సమాచారం అందించారు.
సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్సై అశోక్, క్షణం కూడా వృధా చేయకుండా రాజాలుకు సీపీఆర్ చేశారు. ఆయన గుండె మళ్లీ కొట్టుకునేలా తన శాయశక్తులా ప్రయత్నించారు. అయితే, కొద్దిసేపటికే 108 సిబ్బంది అక్కడికి చేరుకుని పరీక్షించగా, రాజాలు అప్పటికే మృతి చెందినట్లు ధృవీకరించారు.
మృతదేహాన్ని స్వహస్తాలతో మోసి..
మరణవార్త విన్న తర్వాత కూడా ఎస్సై అశోక్ తన సేవా దృక్పథాన్ని చాటుకున్నారు. రాజాలు మృతదేహాన్ని స్వహస్తాలతో మోసి ట్రాక్టర్‌లో వేయించి, బాధిత కుటుంబ సభ్యుల చెంతకు చేర్చారు. ఆపదలో ఉన్నప్పుడు ప్రాణాలు కాపాడాలని చూడటమే కాకుండా, మరణించిన తర్వాత కూడా గౌరవంగా ఇంటికి చేర్చిన ఎస్సై అశోక్ తీరుపై గ్రామస్థులు, సోషల్ మీడియా వేదికగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.