
- రాత్రి వేళల్లో హల్ చల్
- వాహనదారులను వెంబడించి దాడులు
- నియంత్రించడంలో పోలీసుల విఫలం
- నైట్ పెట్రోలింగ్ లకు మంగళం
- విస్తరిస్తున్న విక్రయాలు
అండర్ రైల్వే గేటు ప్రాంతంలో గంజాయి గ్యాంగ్స్ రెచ్చిపోతున్నాయి. ముగ్గురు, నలుగురు గుంపులుగా ఏర్పడి రాత్రి వేళల్లో హల్ చల్ చేస్తున్నారు. వాహనదారులను వెంబడించి దాడులకు పాల్పడుతున్నారు. ఇదేమని ఎవరైనా ప్రశ్నిస్తే వారిపైనే దాడులకు దిగుతున్నారు. నిన్నటికి నిన్న గవిచర్ల క్రాస్ రోడ్ లో 11 మంది యువకులు గంజాయి మత్తులో ఇద్దరిని విచక్షణా రహితంగా కొట్టి పరారయ్యారు. పలువురు మహిళలు సైతం గంజాయి గ్యాంగ్ ఆగడాలకు అవమానాలపాలైన సంఘటనలు ఉన్నాయి. ఇలాంటి సంఘటనలు నిత్యం జరుగుతున్నా పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కేందుకు సాహసించని వారెంతోమంది తమలో తామే కుమిలిపోతున్నారు. గంజాయి గ్యాంగ్ ల అకృత్యాలు అదుపు చేయాల్సిన పోలీసులు చేష్టలుడిగి చూస్తున్నట్లు విమర్శలొస్తున్నాయి. నైట్ ప్రెట్రోలింగ్ లకు పోలీసులు మంగళం పాడడంతో గంజాయి గ్యాంగ్ ల ఇష్టారాజ్యమైంది. ఎవరైనా డయల్ 100 కు ఫోన్ చేసినా స్పందించేవారే కరువయ్యారని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే అండర్ రైల్వే గేటు ప్రాంతంలో గంజాయి విక్రయాలు రోజురోజుకూ పెరుగుతున్నా వాటిని అరికట్టడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారనే చెప్పవచ్చు. బిస్కెట్, చాక్లెట్ లాగా గంజాయి ఎక్కడపడితే అక్కడ లభించడంతో యువత ఈ మత్తులోనే జోగుతున్నారు. పోలీసులకు గంజాయి విక్రయాలు ఎక్కడెక్కడ జరుగుతుందో తెలిసినప్పటికీ మాముళ్ల మత్తులో వాటి జోలికి పోవడంలేదన్న విమర్శలున్నాయి. ఇప్పటికైనా పోలీసు ఉన్నతాధికారులు చర్యలు తీసుకొని గంజాయి విక్రయాలకు అడ్డుకట్ట వేస్తేనే ఈ గ్యాంగ్ ల ఆటకట్టించడం సాధ్యమవుతుందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
-వరంగల్ వాయిస్ ప్రతినిధి