Warangalvoice

రిటైర్డ్‌ ఉద్యోగులను పంపిస్తారా?

ప్రభుత్వంలో వివిధ పద్ధతుల్లో కొనసాగుతున్న విశ్రాంత ఉద్యోగుల తొలగింపుపై సీఎస్‌ శాంతికుమారి ప్రకటన చేశారు. కానీ ఉత్తర్వులు ఉత్తముచ్చటేనని ప్రభుత్వవర్గాల్లో నే చర్చ జరుగుతున్నది. ఎక్స్‌టెన్షన్‌ ఇస్తే చిక్కు లు వస్తాయని గుర్తించి, అందరినీ తొలగించి, ఆ తర్వాత అనుకూల అధికారులను తిరిగి తీసుకొచ్చేందుకు ప్రభుత్వంలోని కొందరు ప్లాన్‌ చేస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.

  • అధికారులు, ఉద్యోగులపై ప్రభుత్వ వైఖరిలో అస్పష్టత
  • అనుకూల అధికారులను కొనసాగించేందుకు ప్రణాళిక
  • ఎక్స్‌టెన్షన్‌పై ఉన్న అధికారుల తొలగింపు ఉత్తదేనా?
  • సీఎస్‌ ఆదేశాలు ప్రచార ఆర్భాటమేనా?

వరంగల్ వాయిస్, హైదరాబాద్‌ : ప్రభుత్వంలో వివిధ పద్ధతుల్లో కొనసాగుతున్న విశ్రాంత ఉద్యోగుల తొలగింపుపై సీఎస్‌ శాంతికుమారి ప్రకటన చేశారు. కానీ ఉత్తర్వులు ఉత్తముచ్చటేనని ప్రభుత్వవర్గాల్లో నే చర్చ జరుగుతున్నది. ఎక్స్‌టెన్షన్‌ ఇస్తే చిక్కు లు వస్తాయని గుర్తించి, అందరినీ తొలగించి, ఆ తర్వాత అనుకూల అధికారులను తిరిగి తీసుకొచ్చేందుకు ప్రభుత్వంలోని కొందరు ప్లాన్‌ చేస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. ఇందుకు అనుగుణంగా ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులోనే వెసులుబాటు ఇచ్చారని సచివాలయవర్గాల్లో చర్చ నడుస్తున్నది.

ఉత్తర్వులు సంగతేంటి?

ప్రభుత్వంలో పదవీ విరమణ తర్వాత కూడా 6,729 మంది అధికారులు, ఉద్యోగులు ఎక్స్‌టెన్షన్‌పై కొనసాగుతున్నారు. వివిధ శాఖలు, ప్రభుత్వ బోర్డులు, కార్పొరేషన్లు, ఏజెన్సీలలో ఎక్స్‌టెన్షన్‌, రీఅపాయింట్‌మెంట్‌, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ పద్ధతుల్లో విధులు నిర్వహిస్తున్నారు. ఇందులో ఐఏఎస్‌ అధికారుల నుంచి అటెండర్ల వరకు ఉన్నారు. వీరందరినీ ఈ నెల 31లోగా తొలగించాలని సీఎస్‌ శాంతికుమారి ఇటీవల అన్నిశాఖలకు ఉత్తర్వులు జారీచేశారు. ఆది, సోమవారం సెలవు దినాలు కావడంతో ప్రభుత్వం విధించిన గడువుకు నేటితో ముగియనుంది. కానీ ప్రభుత్వ ఉత్తర్వులోనే చిన్న మినహాయింపు ఇచ్చారు. ఏదైనా శాఖలో విశ్రాంత అధికారి లేదా ఉద్యోగి సేవలు అత్యవసరం అనుకుంటే అందుకు ఆ శాఖ అధిపతి జస్టిఫికేషన్‌ ఇస్తే ఆ వివరణను పరిశీలించి సదరు అధికారి/ ఉద్యోగిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలా? వద్దా? అనే నిర్ణయం ప్రభుత్వం తీసుకుంటున్నదని ఉత్తర్వులోనే స్పష్టంచేశారు. ఈ ఒక్క వెసులుబాటు ద్వారా కాంగ్రెస్‌ సర్కారు తమకు అనుకూల అధికారులను మళ్లీ యథాస్థానంలో కూర్చోబెట్టే అవకాశమున్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

కొందరికి మినహాయింపు ఇస్తారా?

మంత్రుల వద్ద పనిచేస్తున్న విశ్రాంత అధికారులు, ఉద్యోగులకు టెర్మినేషన్‌ నుంచి మినహాయింపు లభించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తున్నది. గనులశాఖ నుంచి సుశీల్‌ కుమార్‌, మెట్రోరైల్‌ ఎండీ ఎన్‌వీఎస్‌ రెడ్డి, మూసీరివర్‌ ఫ్రంట్‌ /వాటర్‌ బోర్డు నుంచి సత్యనారాయణ, అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులును యథాస్థానాల్లో కొనసాగించే అవకాశాలు ఉన్నట్టు సమాచారం. వివిధ శాఖల్లో కొనసాగుతున్న చాలా మంది రిటైర్డ్‌ అధికారులకు లక్షల్లో వేతనాలు చెల్లిస్తున్నారు. అలా ఒక్కరికి చెల్లించే వేతనంతో నలుగురు కొత్త ఉద్యోగులను ఆ శాఖలోకి ఎలాంటి ఆర్థికభారం లేకుండా తీసుకునే అవకాశాలు ఉన్నాయని నిరుద్యోగులు చెప్తున్నారు. ప్రభుత్వం నిజాయతీగా వ్యవహరించి, విశ్రాంత ఉద్యోగులు అందరినీ తొలగించి యువతకు కొత్త ఉద్యోగాల్లో అవకాశాలు కల్పించాలని నిరుద్యోగ జేఏసీ నాయకులు డిమాండ్‌ చేస్తున్నారు.

Cs Shanti Kumari Made A Statement On The Ongoing Dismissal Of Retired Employees
Cs Shanti Kumari Made A Statement On The Ongoing Dismissal Of Retired Employees

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *