Warangalvoice

మూతపడి ఐదేళ్లు

  • మ్యూజికల్ గార్డెన్ కు
    ముహూర్తమెప్పుడో?
  • కరోనా సమయంలో గేటుకు తాళం
  • ఇప్పటికీ తెరుచుకోని వైనం
  • రూ.3కోట్లతో అభివృద్ధి పనులు పూర్తి
  • ఓపెనింగ్ కు ఎదురుచూపులు

ఉరుకులు, పరుగుల జీవితం గడుపుతున్న నగర ప్రజలకు కొంత ఉపశమనం కలిగించాలన్న లక్ష్యంతో వరంగల్ మహా నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయానికి కూతవేటు దూరంలో ఏర్పాటు చేసిన కాకతీయ మ్యూజికల్ గార్డెన్ మూతబడి ఐదేళ్లు కావస్తోంది. కరోనా సమయంలో గేటుకు వేసిన తాళం ఇప్పటికీ తెరుచుకోలేదు. పార్కును అభివృద్ధి చేస్తున్నామంటూ పాలకులు ప్రకటనలు చేయడం తప్ప అవి ఎప్పటి వరకు పూర్తి అవుతాయో ఎవ్వరూ చెప్పడంలేదు. ప్రారంభోత్సవ ముహూర్తం అప్పుడూ.. ఇప్పుడూ అంటూ సంవత్సరాలు గడిచిపోతున్నా తాళం తీసేవారే కరువయ్యారు. 18 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ పార్క్ ను 1994లో ప్రారంభించారు. భద్రకాళి చెరువు కట్టను ఆనుకుని సువిశాల స్థలంలో పచ్చని చెట్లతో కలర్ ఫుల్ గా కనిపించేది. ఇందులో ఏర్పాటు చేసిన మ్యూజికల్ వాటర్ ఫౌంటెన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తుప్పు పట్టిన ఆటవస్తువుల స్థానంలో కొత్తవి ఏర్పాటు చేయడంతోపాటు గార్డెన్ ను మరింత ఆకర్షణీయంగా తీర్చి దిద్దాలన్న లక్ష్యంతో రూ.13.50 కోట్లతో పలు అభివృద్ధి పనులకు అప్పటి ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ 2017 నవంబర్ లో శంకుస్థాపన చేసినప్పటికీ నిధులు విడుదల చేయలేదు. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.3కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టింది. పనులు వేగవంతంగా పూర్తి అయినప్పటికీ ప్రారంభోత్సవానికి ముహూర్తం ఫిక్స్ కావడం లేదు. దీనిపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
-వరంగల్ వాయిస్ ప్రతినిధి

వరంగల్ వాయిస్ ప్రతినిధి : రోజు రోజుకూ విస్తరిస్తున్న వరంగల్ నగరంలో నివాసముంటున్న ప్రజలతోపాటు, పర్యాటకులకు ఆహ్లాదంతోపాటు ఆరోగ్యాన్ని అందించాలన్న లక్ష్యంతో ఏర్పాటు చేసిన కాకతీయ మ్యూజికల్ గార్డెన్ మూలకు పడి ఐదేళ్లు కావస్తోంది. 1994లో అట్టహాసంగా ప్రారంభించిన మ్యూజికల్ గార్డెన్ కొద్ది రోజుల పాటు పర్యాటకులతో కిటకిటలాడింది. ఇందులో ఏర్పాటు చేసిన మ్యూజికల్ వాటర్ ఫౌంటెన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రతి రోజు రాత్రి 7 గంటలకు ప్రారంభమయ్యే ఈ షోను చూసేందుకు నగర ప్రజలు భారీ సంఖ్యలో తరలి వచ్చేవారు. సాధారణ దినాల్లో ఒక షో నిర్వహిస్తే, ఆదివారం, ఇతర పర్వదినాల్లో రెండు షోలు ఏర్పాటు చేసేవారు. దీనితోపాటు ల్యాండ్ స్కేసింగ్, డక్ పాండ్, పడవల చెరువు, వాటర్ పాల్స్, చిల్డ్రన్ గేమ్స్ పార్క్, కాక్టస్ గార్డెన్, ప్రాక్ రాక్ పాయింట్ డైనోసార్, ఇండోర్ చిల్డ్రన్ పార్క్, కాటేజీలు పర్యాటకులను అమితంగా ఆకట్టుకునేవి.

పర్యాటక ప్రాంతం..
నగరం నడిబొడ్డున ఉన్న కాకతీయ మ్యూజికల్ గార్డెన్ పర్యాటక ప్రాంతంగా కూడా ఖ్యాతి గడించింది. ఈ గార్డెన్ కు సమీపంలోనే రాష్ట్రంలోనే ప్రఖ్యాతి గాంచిన శ్రీ భద్రకాళి దేవాలయం, సమీపంలోనే కాకతీయ పురావస్తు శాఖ మ్యూజియం, పక్కనే గ్రేటర్ వరంగల్ ప్రధాన కార్యాలయం, చేరువలోనే ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలకు పెద్ద దిక్కుగా వెలుగొందుతున్న ఎంజీఎం ఆస్పత్రి ఉండడం మ్యూజికల్ గార్డెన్ కు కలిసొచ్చిందనే చెప్పవచ్చు. మధ్యాహ్నం, సాయంత్రం వేళల్లో సేదతీరడంతోపాటు స్వచ్ఛమైన గాలి కోసం ఎంతో మంది మ్యూజికల్ గార్డెన్ ను ఆశ్రయించేవారు. మహిళలను అమితంగా ఆకట్టుకునే గులాబీ తోట, చిన్న పిల్లలు తమ ఇతర స్నేహితులతో కలిసి ఆనందంగా ఆడుకునేందుకు పిల్లల పార్క్ ఇలా ఎన్నో విషేశాలు పార్క్ వైపు పర్యాటకులను నడిపించేది.

రూ.13.50 కోట్ల అంచనాతో..
కాకతీయ మ్యూజికల్ గార్డెన్ లో పిల్లలకోసం ఏర్పాటు చేసిన ఉపకరణాలు పూర్తిగా పాడయ్యాయి. అదే విధంగా మ్యూజికల్ వాటర్ ఫౌంటెన్ లో లోపాల కారణంగా పనిచేయడం నిలిచిపోయింది. సందర్శకులు కూర్చుండి తిలకించేందుకు వీలుగా ఏర్పాట్లు చేసిన కుర్జీలు తుప్పు పట్టిపోయాయి. దీనికితోడు అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో చెత్తా, చెదారంతో నిండి దుర్ఘందం వెదజల్లడంతో సందర్శకుల సంఖ్య భారీగా తగ్గింది. గర్డెన్ ను ఆదునిక హంగులతో పునర్నిర్మాణం చేసేందుకు అప్పటి కేసీఆర్ సర్కార్ శ్రీకారం చుట్టింది. రూ.13.50 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు అప్పటి ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు 18 నవంబర్ 2017లో శంకుస్థాపన చేశారు. కాని నిధులు విడుదల చేయకపోవడంతో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి.

రూ.3 కోట్లతో అభివృద్ధి..
కళా విహీనంగా మారిన కాకతీయ మ్యూజికల్ గార్డెన్ కు పూర్వ వైభవం తేవాలన్న లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ వివిధ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టింది. రూ.3కోట్ల నిధులను కేటాయించడంతో పనులు చకచకా సాగాయి. అయితే అధికారుల నిర్లక్ష్యంతో కొన్ని పనులు పెండింగ్ లోనే ఉన్నాయి. గత కొంత కాలంగా ప్రారంభోత్సవానికి అప్పుడు.. ఇప్పుడూ అంటూ ప్రచారం జరుగుతున్నా కార్యరూపం దాల్చడం లేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పెండింగ్ లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేసి మ్యూజికల్ గార్డెన్ ను ప్రారంభించాలని స్థానికులు కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *