
పండుగ ఉత్సాహంలో గ్రామస్తులు
వరంగల్ వాయిస్, కమలాపూర్: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే సంక్రాంతి సంబరాలు కమలాపూర్ మండల కేంద్రంలో భోగి మంటలతో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ప్రతి ఏటా ఆనవాయితీగా వస్తున్నట్లుగానే, ఈ ఏడాది కూడా ప్రగతి యూత్ ఆధ్వర్యంలో తెల్లవారుజామునే భోగి మంటల కార్యక్రమాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
సందడిగా భోగి వేడుకలు – సర్పంచ్ సందడి
గ్రామ నడిబొడ్డున మంటలు వెలిగించడంతో ఊరంతా పండుగ కళ సంతరించుకుంది. ఈ వేడుకలో సర్పంచ్ సతీష్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. కేవలం అతిథిలా కాకుండా, గ్రామపంచాయతీ సిబ్బందితో కలిసి ఆయన స్వయంగా నృత్యం (డ్యాన్స్) చేస్తూ పండుగ ఉత్సాహాన్ని రెట్టింపు చేశారు. ఒక ప్రజాప్రతినిధి సామాన్య ప్రజలతో కలిసి చిందేయడం చూసి గ్రామస్తులు చప్పట్లతో తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఇది ప్రజలకు, ప్రజాప్రతినిధికి మధ్య ఉన్న అనుబంధానికి నిదర్శనమని పలువురు కొనియాడారు. ఈ సందర్భంగా సర్పంచ్ సతీష్ మాట్లాడుతూ.. తెలంగాణ సంప్రదాయాలను కాపాడుకోవడంలో ప్రగతి యూత్ చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. ఈ భోగి మంటలు గ్రామ ప్రజల జీవితాల్లోని కష్టాలను తొలగించి, అష్టైశ్వర్యాలు, సుఖసంతోషాలను నింపాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ప్రగతి యూత్ అధ్యక్షులు బాలసాని కుమార్ స్వామి, మాజీ సర్పంచ్ రవికుమార్, వార్డు సభ్యులు పుల్ల శ్రీనివాస్, అశోక్, అనిల్, రాజేష్, తిరుపతి, ఐలయ్య, సతీష్, రాజయ్య పాల్గొన్నారు. వీరితో పాటు ప్రగతి యూత్ సభ్యులు, గ్రామపంచాయతీ కార్మికులు, మహిళలు, చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఒకరికొకరు పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.