
- ట్రైబల్ వెల్ఫేర్ బాలికల గురుకులంలో ఆహారం
- తినలేక పస్తులుంటున్న విద్యార్థులు
- మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ తనిఖీతో వెలుగులోకి
- మన బిడ్డలకు ఇలాగే పెడతామా అంటూ నిలదీత
సాక్షాత్తు కలెక్టర్, జిల్లా అధికార యంత్రాంగం నిత్యం సంచరించే మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ట్రైబల్ వెల్ఫేర్ బాలికల గురుకులంలోని విద్యార్థినులకు మాడిన అన్నం..గొడ్డు కారమే దిక్కైంది. తింటే తిను లేకుంటే పస్తులుండు అన్నట్లుగా అక్కడి వార్డెన్లు వ్యవహరించడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. ప్రభుత్వం ఒకవైపు విద్యార్థులకు మెరుగైన భోజనం వడ్డిస్తున్నామంటూ ప్రకటనలు చేస్తున్నప్పటికీ క్షేత్ర స్థాయిలో మాత్రం అది అమలుకు నోచుకోవడం లేదు. కలెక్టర్లు గురుకులాలను నెలకోసారి విజిట్ చేస్తున్నా పరిస్థితిలో మార్పు రావడంలేదు. కలెక్టర్లు, ఇతర అధికారులు క్షేత్ర స్థాయి పరిశీలనకు వస్తున్నారని ముందే తెలుసుకుంటున్న గురుకులం నిర్వాహకులు ఆ ఒక్క పూట మాత్రం విద్యార్థులకు పంచభక్ష పరమాన్నాలు అందించి అధికారుల చేత శభాష్ అనిపించుకుంటున్నారు. వారు పోయిన తర్వాత మాడిన అన్నం.. గొడ్డు కారమే వడ్డిస్తున్నారన్నది పచ్చి నిజం. శనివారం మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ తనిఖీతో విద్యార్థులకు వడ్డిస్తున్న భోజనం వెలుగులోకి వచ్చింది. మన బిడ్డలకు ఇలాగే పెడతామా అంటూ ఆమె అక్కడి అధికారులను నిలదీశారు.
వరంగల్ వాయిస్, మహబూబాబాద్ : వరంగల్ వాయిస్, మహబూబాబాద్ : జిల్లా కేంద్రంలోని ట్రైబల్ వెల్ఫేర్ బాలికల గురుకుల పాఠశాలలో శనివారం మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ పర్యటించారు. విద్యార్ధినుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు గొడ్డు కారంతో బ్రేక్ ఫాస్ట్ పెట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులకు ఆరోగ్యకరమైన భోజనం అందిస్తున్నామంటూ పేపర్లు, టీవీల్లో ప్రకటనలు చేస్తున్న ప్రభుత్వానికి మాడిన అన్నం.. గొడ్డు కారం కనిపించడంలేదా అని ప్రశ్నించారు. ముద్దలు, ముద్దలుగా ఉన్న అన్నం తినలేక విద్యార్థినులు ఖాళీ కడుపులతోనే తరగతి గదుల్లోకి వెళ్లడంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఇదేనా కాంగ్రెస్ ప్రభుత్వం గురుకులాల్లో అందిస్తున్న భోజనం అంటూ నిలదీశారు.
విద్యార్థులను పట్టించుకోరా..?
గురుకులాల్లో చదువుతున్న పేద, మధ్య తరగతి విద్యార్థులపై ప్రభుత్వానికి ఎందుకింత నిర్లక్ష్యం అంటూ సత్యవతి రాథోడ్ ప్రశ్నించారు. బావి భారత పౌరులుగా ఎదగాల్సిన విద్యార్థులకు మీరిచ్చే ఆహారం ఇదేనా అంటూ నిలదీశారు. విద్యార్థులు తినకుండా చెత్త బుట్టలో వేసిన అన్నాన్ని చూపించి మన బిడ్డలకు ఇలాగే పెడతామా అంటూ ప్రశ్నించారు. అనేక మంది గురుకుల విద్యార్థులు ఫుడ్ పాయిజన్ తో మృతి చెందుతున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదని విమర్శించారు. కేసీఆర్ ఆనవాళ్లు మారుస్తా అంటే విద్యార్థులు గురుకులానుంచి టీసీలు తీసుకుని వెళ్లిపోవడమా? అంటూ ప్రశ్నించారు. పలువురు విద్యార్థులు వారి సమస్యల సత్యవతి రాథోడ్ దృష్టికి తీసుకురాగా వాటిపై అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తానంటూ హామీ ఇచ్చారు.