
వరంగల్ వాయిస్, దామెర : మండలంలోని తక్కళ్లపాడు గ్రామంలో మహిళా భవన నిర్మాణ మంజూరు కోసం తన వంతు కృషి చేస్తానని ఎంపీడీవో గుమ్మడి కల్పన హామీ ఇచ్చారు. బుధవారం తక్కళ్లపాడు గ్రామస్తులు ఎంపీడీవోను కలిసి, గ్రామంలో మహిళా భవనం లేకపోవడం వల్ల ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించారు. ఈ మేరకు ఆమెకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ.. మహిళా భవన నిర్మాణానికి సంబంధించి గ్రామ పంచాయతీ పాలకవర్గం తీర్మానం చేయడంలో నిర్లక్ష్యం వహిస్తోందని ఎంపీడీవో దృష్టికి తీసుకెళ్లారు. భవనం లేక మహిళలు వివిధ కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వినతిపత్రం స్వీకరించిన అనంతరం ఎంపీడీవో స్పందిస్తూ.. ఐకేపీ ఏపీఎం, పంచాయతీ కార్యదర్శి, సర్పంచ్లతో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకుంటానని చెప్పారు. వెంటనే పంచాయతీ తీర్మానం ఇచ్చేలా అవసరమైన చర్యలు తీసుకుంటామని ఆమె గ్రామస్తులకు హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ బింగి రాజేందర్, కొత్తపల్లి నాగేందర్, మామిడిశెట్టి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.