
తహశీల్దార్ జ్యోతి వరలక్ష్మి దేవి
వరంగల్ వాయిస్, దామెర : ప్రభుత్వ భూములను ఆక్రమించే వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని దామెర మండల తహశీల్దార్ జ్యోతి వరలక్ష్మి దేవి హెచ్చరించారు. శనివారం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘99 రోజుల ప్రణాళిక’లో భాగంగా తహశీల్దార్ కార్యాలయ ప్రాంగణంలో పారిశుధ్య పనులను నిర్వహించారు. కార్యాలయ సిబ్బందితో కలిసి తహశీల్దార్ స్వయంగా పారిశుధ్య పనుల్లో పాల్గొన్నారు. కార్యాలయ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ప్రజలకు మెరుగైన సేవలందించే క్రమంలో ఆహ్లాదకరమైన వాతావరణం అవసరమని ఆమె పేర్కొన్నారు. విధుల్లో భాగంగా ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేయాలని సూచించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వ భూముల రక్షణ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఎవరైనా ప్రభుత్వ స్థలాలను ఆక్రమించినా లేదా అక్రమ నిర్మాణాలకు పాల్పడినా వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్నారు. క్షేత్రస్థాయిలో రెవెన్యూ యంత్రాంగం నిరంతరం నిఘా ఉంచుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహశీల్దార్ యూసుఫ్ ఖురేషి, ఆర్ఐలు భాస్కర్ రెడ్డి, సంపత్ రావు, జీపీఓలు, తహశీల్దార్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.