Warangalvoice

ప్రతి నిరుపేద ఆడబిడ్డకు ఇందిరమ్మ ఇళ్లు

  • అదే ఇందిరమ్మ ప్రభుత్వ లక్ష్యం
  • రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క

వరంగల్ వాయిస్, ములుగు : పేద వాడి కలలను నిజం చేయడానికి ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతోందని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఎస్సీ కాలనీలో ఇందిరమ్మ ఇండ్ల భూమి పూజ, నిర్మాణం పనులను అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు సంపత్ రావు, మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవి చందర్ లతో కలసి ప్రారంభించారు. ఈ సందర్భంగా.. మంత్రి సీతక్క మాట్లాడుతూ ప్రతి నిరుపేద ఆడబిడ్డకు ఇందిరమ్మ ఇంటిని నిర్మించి ఇవ్వాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు. ప్రతి నిరుపేద కుటుంబం ఇంటిని నిర్మించుకునేందుకు రూ.5 లక్షలను ప్రభుత్వమే సమకూర్చుతోందన్నారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ కార్యక్రమాలను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. పేదవారి సంక్షేమమే ధ్యేయంగా ప్రజా ప్రభుత్వం ముందుకు అడుగులు వేస్తుందని, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ ఫలాలను అర్హులైన నిరుపేదలందరికీ అందే విధంగా చర్యలు తీసుకుంటానని మంత్రి సీతక్క హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సంపత్, ఎంపీడీఓ రామకృష్ణ, ప్రజాప్రతినిధులు, ఇందిరమ్మ ఇండ్ల కమిటీ సభ్యులు, కాలనీ వాసులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *