
తహశీల్దార్ జ్యోతి వరలక్ష్మి దేవి
వరంగల్ వాయిస్, దామెర : మండల కేంద్రంలో శనివారం ‘సివిల్ రైట్స్ డే’ (పౌర హక్కుల దినోత్సవం) కార్యక్రమాన్ని అత్యంత ప్రాధాన్యతతో నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని ఎస్సీ, ఎస్టీ వర్గాల ప్రజలకు ప్రభుత్వం కల్పించిన ప్రత్యేక హక్కులు మరియు రక్షణ చట్టాలపై అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తహశీల్దార్ జ్యోతి వరలక్ష్మి దేవి మాట్లాడుతూ.. రాజ్యాంగం కల్పించిన పౌర హక్కుల పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం మరియు ఇతర ప్రత్యేక హక్కుల గురించి వివరిస్తూ, సామాజిక సమానత్వం సాధించినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. ఎవరికైనా అన్యాయం జరిగితే చట్టం అండగా ఉంటుందని, హక్కులను వినియోగించుకోవడంలో వెనకడుగు వేయవద్దని ఆమె పిలుపునిచ్చారు.
గ్రామాల్లో అస్పృశ్యత వంటి వివక్షలకు తావు లేకుండా చూడాలని, అందరూ కలిసిమెలిసి జీవించినప్పుడే గ్రామ వికాసం సాధ్యమని అధికారులు ఈ సందర్భంగా వివరించారు. ఈ కార్యక్రమంలో పోలీసు శాఖ తరపున ఏఎస్ఐ పాల్గొని, చట్టపరమైన రక్షణల గురించి ప్రజలకు వివరించారు. ఈ సదస్సులో దామెర గ్రామ సర్పంచ్, హౌసింగ్ ఏఈ, మండల గిర్దావర్, దామెర ఏఎస్ఐ, పంచాయతీ కార్యదర్శి, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.