
వరంగల్ వాయిస్, చిట్యాల : అక్రమాలకు పాల్పడుతూ, తమ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి పోలీసులపై తప్పుడు ఆరోపణలు చేస్తూ బ్లాక్‌మెయిల్‌కు దిగేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చిట్యాల సర్కిల్ ఇన్‌స్పెక్టర్ డి.మల్లేష్ హెచ్చరించారు. శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ, పోలీసు శాఖ ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నం చేస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. గత నవంబర్ చివరి వారంలో చిట్యాల శివాజీ విగ్రహం వద్ద పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో మోత్కూరు నరేష్ అనే వ్యక్తి 473 రీడింగ్‌తో (తీవ్ర మద్యం మత్తు) పట్టుబడ్డాడు. అతని వాహనాన్ని తనిఖీ చేయగా 5 లీటర్ల గుడుంబా లభ్యమైంది. దీంతో పోలీసులు నిందితుడు నరేష్‌తో పాటు సాదా రాములుపై కేసు నమోదు చేసి వాహనాన్ని సీజ్ చేశారు. జనవరి 16న నిందితుడు అంబేద్కర్ విగ్రహం వద్ద పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ, తన వాహనాన్ని కావాలనే ఇవ్వడం లేదని తప్పుడు ఆరోపణలు చేయడాన్ని సీఐ తీవ్రంగా ఖండించారు. ఈ ఉదంతంలో కొంతమంది వ్యక్తులు తమ స్వలాభం కోసం పోలీసులకు రాజకీయ రంగు అంటగట్టడం తగదని ఆయన మండిపడ్డారు. పోలీసుల విధి నిర్వహణకు ఆటంకం కలిగిస్తూ, శాఖ ప్రతిష్టను దెబ్బతీసే వారిపై న్యాయ సలహా మేరకు కఠిన కేసులు నమోదు చేస్తాం. పోలీసులకు అన్ని వర్గాల ప్రజలు సమానమే. పగలు, రాత్రి ప్రజల రక్షణ కోసం పనిచేసే అధికారులను రాజకీయాల్లోకి లాగడం సరికాదు. రాజకీయ విభేదాలు ఉంటే నాయకులు చూసుకోవాలి తప్ప, పోలీసులను ఇబ్బందులకు గురిచేయాలని చూస్తే సహించే ప్రసక్తే లేదు. ప్రజలు వాస్తవాలను గ్రహించాలని, చట్టవ్యతిరేక పనులకు పాల్పడే వారికి, పోలీసులపై తప్పుడు ఆరోపణలు చేసే వారికి సహకరించవద్దని సీఐ మల్లేష్ విజ్ఞప్తి చేశారు.