
వరంగల్ వాయిస్,చిట్యాల : ప్రతిష్టాత్మకమైన మేడారం జాతరకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం చిట్యాల మండల కేంద్రంలో పకడ్బందీ ఏర్పాట్లు చేసేందుకు ఆర్టీసీ అధికారులు సమాయత్తమవుతున్నారు. శనివారం పరకాల బస్ డిపో మేనేజర్ (డీఎం) రామ్ ప్రసాద్ చిట్యాల గ్రామ పంచాయతీని సందర్శించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మరియు ఉపసర్పంచ్‌లను ఆయన మర్యాదపూర్వకంగా కలిసి, శాలువాతో ఘనంగా సన్మానించారు. రాబోయే మేడారం జాతరను పురస్కరించుకుని, చిట్యాల ప్యాక్స్ (PACS) గ్రౌండ్‌లో తాత్కాలిక బస్ పాయింట్‌ను ఏర్పాటు చేయాలని ఆర్టీసీ నిర్ణయించింది. ఈ బస్ పాయింట్ వద్ద ప్రయాణికులకు అవసరమైన కనీస మౌలిక సదుపాయాలు (తాగునీరు, విద్యుత్, షెడ్లు) కల్పించాలని డిఎం సర్పంచ్‌ను కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన సర్పంచ్, అవసరమైన అన్ని సదుపాయాలను కల్పిస్తామని హామీ ఇచ్చారు. చిట్యాల మండల కేంద్రంలో ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న నూతన బస్టాండ్‌ను ప్రారంభించాలని సర్పంచ్ డీఎంను కోరారు. దీనిపై తక్షణమే స్పందించిన డిఎం రామ్ ప్రసాద్, బస్టాండ్ ఆవరణను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మేడారం జాతర ముగిసిన వెంటనే, అన్ని హంగులతో ఈ నూతన బస్టాండ్‌ను ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని డీఎం ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. దీంతో చిట్యాల ప్రజల చిరకాల కోరిక త్వరలోనే నెరవేరనుంది. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ బుర్ర వెంకటేష్ గౌడ్, 4వ వార్డు సభ్యుడు తౌటం నవీన్, గ్రామ కార్యదర్శి రవికుమార్, ఆర్టీసీ సిబ్బంది నందకుమార్, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.